ఏపీ గురించి ఏమిమాట్లాడినా చెల్లుబాటవుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే చాలా తేలికగా అవమానించేశారు. అయితే యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని మరచిపోవటంతో అసలు సమస్య వచ్చింది. తన వ్యాఖ్యలపై ఈ స్ధాయిలో రివర్స్ ఎటాక్ జరుగుతుందని ఊహించలేదు. అందుకనే సర్దుబాటు ధోరణిలో ట్విట్లు పెట్టారు. పక్కరాష్ట్రంలో రోడ్లు, నీళ్ళు, కరెంటు అధ్వాన్నంగా ఉన్నాయని కేటీయార్ చేసిన వ్యాఖ్యలు రివర్సుకొట్టాయి. హైటెక్స్ లో చేసిన ఓ సమావేశంలో కేటీయార్ మాట్లాడుతు పేరెత్తకుండానే ఏపీని కించపరుస్తు మాట్లాడారు. దానికి రివర్సు అన్నట్లుగా ఏపీ మంత్రులు ఫుల్లుగా వాయించేశారు.






మంత్రులు బొత్సా సత్యానారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు రోజా, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జోగిరమేష్, ఎంఎల్ఏ మల్లాది విష్ణు తదితరులు కేటీయార్ వ్యాఖ్యలపై రివర్స్ ఎటాక్ చేసేటప్పటికి ఖంగుతిన్నారు. దాంతో రాత్రయ్యేసరికి కేటీయార్ మరో ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి, తాను సోదర సమానులమన్నారు. తానుచేసిన వ్యాఖ్యలు సోదరులకు బాధకలిగించినట్లుందన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అసలు ఓవర్ యాక్షన్ చేయటం ఎందుకు ? మంత్రుల నుండి రివర్స్ ఎటాక్ మొదలవ్వగానే సర్దుబాటు ధోరణిలో ట్వీట్లు పెట్టడం ఎందుకు ?







తమ గొప్పదనం చెప్పుకోవటం కోసం పొరుగురాష్ట్రాన్ని అవమానించాల్సిన అవసరంలేదు.  కించపరచాల్సిన అవసరంలేదు. ఏపీ గురించి ఏ అంశాలనైతే కేటీయార్ లేవనెత్తారో అవే అంశాలు తెలంగాణాలో కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో కరెంటు రోజుకు ఎన్నిసార్లు పోతుందో ఎవరు చెప్పలేరు. అలాగే హైదరాబాద్ లో రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అందరికీ తెలుసు. రోడ్డుమీద గుంతల వల్ల జరిగిన ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారో కేటీయార్ మరచిపోయినట్లున్నారు.






పెద్దవర్షం వస్తే హైదరాబాద్ పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ప్రపంచానికంతా తెలుసు. పెద్దవర్షానికి కాలనీలకు కాలనీలే రోజుల తరబడి ముణిగిపోయిన సందర్భాలు ఎన్నోఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే తెలంగాణా అంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు. హైదరాబాద్ లోనే పరిస్ధితులు ఇంత అధ్వాన్నంగా ఉంటే మిగిలిన రాష్ట్రం పరిస్ధితేంటి ? కాబట్టి కేటీయారే చెప్పుకున్నట్లు కచ్చితంగా ఇది డప్పుకొట్టుకోవటమే. తన వ్యాఖ్యలపై ఇంతమంది మంత్రులు ఒక్కసారిగా రివర్స్ ఎటాక్ చేస్తారని ఊహించుండరు. అందుకనే ఖంగుతిన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: