ఏపీలో వైసీపీని విమర్శించే క్రమంలో టీడీపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం మొదలు పెట్టారు. తెలంగాణలో పాలన బాగుందని కితాబిచ్చారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణలో రైతులకోసం అవలంబిస్తున్న పథకాలు, వాటి అమలుతీరు కూడా బాగుందని మెచ్చుకున్నారు. ఇంతకీ సోమిరెడ్డి ఎందుకిలా మాట్లాడారు..?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పక్క రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. అనుకోకుండా చేసిన ఆ వ్యాఖ్యలు కొంతమందిని నొప్పించాయని, అయితే తన ఉద్దేశం అది కాదని ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు కేటీఆర్. అయినా కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలకు అదే రోజు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో టీడీపీ నేతలు కేటీఆర్ వ్యాఖ్యల్ని స్వాగతించారు. మరికొందరు మాత్రం టీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కై ఇలాంటి రాజకీయ రచ్చ తీసుకొచ్చాయని, సమస్యల్ని పక్కదారి పట్టించడం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాత్రం కాస్త విభిన్నంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుని ఆయన మెచ్చుకున్నారు. తెలంగాణను చూసి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సి ఉందన్నారు సోమిరెడ్డి. తెలంగాణలో రైతు బంధు పేరుతో ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తున్నారని, ఏపీలో రైతు భరోసా ఉన్నా కూడా ఒక్కో కుటుంబానికి రూ.7500 మాత్రమే అందుతోందని  విమర్శించారు సోమిరెడ్డి. అక్కడ ప్రతి ఎకరాకు ఆర్థిక సాయం అందుతుంటే.. ఇక్కడ ఎకరాలను పట్టించుకోకుండా కేవలం రైతుకి ఇంత అనే రీతిలో సాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్ సరఫరాపై కూడా సోమిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో  24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నారని చెప్పారు సోమిరెడ్డి. ఏపీలో మాత్రం 9 గంటల సరఫరాను ఇప్పుడు 7 గంటలకు తగ్గించారని అన్నారు. ఆయా విషయాల్లో ఏపీ ప్రభుత్వం కంటే తెలంగాణ చాలా మేలు అని కితాబిచ్చారు సోమిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: