విజయవాడనుంచి కొరియర్ వెళ్లిన పార్శిల్ లో డ్రగ్స్ ఉండటంతో ఏపీలో కలకలం రేగింది. అసలు బెజవాడనుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయా..? ఒకవేళ అదే నిజమైతే ఎక్కడెక్కడికి సరఫరా అవుతున్నాయి..? ఇన్నాళ్లు వాటిని ఎందుకు గుర్తించలేకపోరు..? అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

విజయవాడలోని కొరియర్‌ సంస్థ ద్వారా కెనడాకు వెళ్లిన ఎపిడ్రిన్‌ అనే మందు పొడిని బెంగళూరులోని కస్టమ్స్‌ అధికారులు సీజ్ చేశారు. ఈ పొడర్ ఉన్న పార్శిల్ ని కొరియర్‌ చేసిన యువకుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేసి కస్టడీ కోరారు. విజయవాడ భారతీనగర్‌ లోవు డీఎస్టీ పేరుతో ఓ కొరియర్ సంస్థ ఉంది. ఇక్కడినుంచి దేశ విదేశాలకు కూడా పార్శిల్స్ వెళ్తుంటాయి. వాస్తవానికి ఇది అమెరికాకు చెందిన సంస్థ అంటున్నారు. ఈ కంపెనీలో విజయవాడ బ్రాంచ్ కోసం ప్రసాదంపాడుకు చెందిన తేజ అనే యువకుడు పని చేస్తున్నాడని తేలింది. అతనొక్కడే విజయవాడలో ఆ ఆఫీస్ పనులన్నీ చూస్తుంటాడు. మరి దీనికి విజయవాడ బ్రాంచ్ తీసుకున్న నిర్వాహకుడెవరో తెలియడంలేదు.

ఈ క్రంలో తేజ పనిచేస్తున్న కొరియర్ సంస్థ ద్వారా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కొండవీటి గోపీసాయి అనే యువకుడు తరచూ వివిధ దేశాలకు పార్శిల్స్ పంపిస్తుంటాడని తెలిసింది. ఈ కొరియర్‌ ద్వారా ఆస్ట్రేలియాకు ఊరగాయలు, దుస్తులు పంపేవాడని అంటున్నారు. ఇలా తేజ, గోపీసాయి మధ్య పరిచయం పెరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా గోపీసాయి ఆస్ట్రేలియాకు పంపిన ఓ పార్శిల్ అసలు వివాదానికి కారణం అయింది. 2022 జనవరి 31న గోపీసాయి ఇక్కడి నుంచి పార్శిల్ ను ఆస్ట్రేలియాలో ఉన్న అడ్రస్ కు పంపించాడు. ప్రతి కొరియర్ కి ఆధార్ కార్డ్ తో ఉన్న వివరాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే తన ఆధార్ కార్డ్ లో అడ్రస్ సరిగా లేదనే వంకతో ఆ పార్శిల్ కు తేజ అడ్రస్ ని జతచేసి పంపించారట.

అయితే ఆస్ట్రేలియా వెళ్లాల్సిన కవర్ కెనడా వెళ్లడం, అక్కడినుంచి అది బెంగళూరు చేరడంతో అసలు కథ మొదలైంది. కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి పార్శిల్ విప్పడంతో అందులో చీరలు, వాటి మధ్య ఉన్న ఎపిడ్రిన్ పౌడర్ బయటపడింది. దీంతో విజయవాడకు చెందిన తేజ అడ్రస్ పట్టుకుని, స్థానిక పోలీసుల సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకి తరలించారు. కోర్టులో హాజరు పరిచి, తిరిగి తమ కస్టడీకి తీసుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: