పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలువిన్న తర్వాత ఎవరికైనా ఇదే అనుమానాలు పెరిగిపోతాయి. ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు, పార్టీ వ్యవహారాలు, టీఆర్ఎస్ వ్యవహారాలు, కేసీయార్ గెలుపు అవకాశాలు, బీజేపీ పరిస్ధితి ఇలా అనేక అంశాలపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వలేం కాబట్టి ముఖ్యమైన పాయింట్లను మాత్రం టచ్ చేస్తాను.





హోలు మొత్తంమీద రేవంత్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత రేవంత్ ది కాన్ఫిడెన్సా ? లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా ? అన్న అనుమానం  పెరిగిపోతోంది. పీసీసీ చీఫ్ కాబట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే అని చెప్పుకోవటంలో తప్పులేదు. తమ పార్టీ బలాలు, బలహీనతల గురించి నిర్మొహమాటంగా అంగీకరించినందుకు రేవంత్ ను అభినందించాల్సిందే. కాకపోతే ప్రత్యర్ధిపార్టీలు అందులోను కేసీయార్ గురించి చేసిన వ్యాఖ్యలపైనే అనుమానంగా ఉంది.





రేవంత్ ఏమంటారంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందన్నారు. పదేళ్ళపాటు కాంగ్రెస్సే రాష్ట్రాన్ని ఏలుతుందన్నారు. టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని గట్టిగా చెప్పారు. కేసీయార్ కు డిపాజిట్ కూడా గల్లంతవుతుందన్నారు. ఇక్కడే కాస్త ఓవర్ అనిపిస్తోంది. పనిలోపనిగా బీజేపీ గెలిచే సీట్లు ఏమీ ఉండవన్నారు. బీజేపీ అసలు పోటీలోనే లేదని చెప్పటమే కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఉపఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధరణ ఎన్నికల్లో అవే రిజల్టు రిపీటవుతాయని అనుకునేందుకు లేదన్నారు.





మొన్నటి ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ గెలుపు ప్రత్యేక పరిస్ధితుల్లో మాత్రమే సాధ్యమైందని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గొడవలు, నేతల మధ్య విబేధాలు ఎప్పుడూ ఉండేవే అన్నారు. కేసీయార్ ను ఎప్పుడెప్పుడు దించేద్దామా అని జనాలంతా ఆతృతుగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని జనాలంతా రోజులు లెక్క పెట్టుకుంటున్నారట. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ముక్కలు చెక్కలైపోతాయని జోస్యం  కూడా చెప్పారు. కేసీయార్ పాలనను జనాలు భరించేందుకు సిద్ధంగా లేరని రేవంత్ చెప్పారు. మరి రేవంత్ చెప్పిందాంట్లో ఎంత నిజముందో ఎన్నికలు వస్తేకానీ తెలీదు.






మరింత సమాచారం తెలుసుకోండి: