ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటు బస్సులను తీసుకుంటోంది. అందులో తప్పేముంది. ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచింది. అందులో కూడా తప్పేం లేదు. ఆర్టీసీ దగ్గర బస్సులు కొని వాటిని వినియోగించే సామర్థ్యం లేనప్పుడు హైర్ బస్సులవైపు వెళ్లడాన్ని ఎవరూ తప్పుబట్టరు. అయితే ఇక్కడ మరో లొసుగు ఉంది. హైర్ బస్సులు వస్తున్నాయంటే, ఆ స్థానంలో డ్రైవర్లు కూడా బయటివారే ఉంటారు. అంటే ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్ లు భర్తీ చేయాల్సిన అవసరం లేదనమాట. సరిగ్గా ఈ విషయంపైనే ఇప్పుడు ఏపీలో రచ్చ మొదలవుతోంది.

ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుకు జీతాలు ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ క్రమంలో సొంత బస్సుల సంఖ్యను ఆర్టీసీ మరింతగా పెంచితే సంస్థ ఆర్థికంగా పరిపుష్టిగా మారుతుంది. అయితే ఆర్టీసీ మాత్రం అలా చేయడంలేదు. అద్దె బస్సుల సంఖ్య పెంచేస్తోంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోని ప్రజా రవాణాశాఖ ఉద్యోగులుగా మారిపోయారు. అంటే ఇప్పుడిక ఆర్టీసీ ఖాళీలను భర్తీ చేయాల్సిన బాధ్యత, ఆ సంస్థపై లేదు, ప్రభుత్వంపైనే ఉంది.

ప్రస్తుతం ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకుంటే డ్రైవర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టే అవసరం ఉండదు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో 11,236 బస్సులు ఉన్నాయి. వీటిలో సంస్థకి సంబంధించిన సొంత బస్సులు 8,972. మిగతా 2,264 బస్సులను అద్దెకు తిప్పుతున్నారు. ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సుల్లో 3వేల బస్సులు డొక్కు బస్సులుగా మారిపోయాయి. వీటి స్థానంలో కొత్తవి తీసుకోవాలి. కానీ ప్రభుత్వం మాత్రం కొత్తవి కాకుండా అద్దె బస్సులు తీసుకుంటామంటోంది. ఈ అద్దె బస్సులతోపాటు, 100 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కూడా ఆర్టీసీకి వస్తాయి.

ముఖ్యంగా అద్దె బస్సుల విషయంలోనే రచ్చ మొదలవుతోంది. అద్దెకు బస్సులు తీసుకుంటే డ్రైవర్ పోస్ట్ ల భర్తీ ఆగిపోతుంది. అంటే ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. భవిష్యత్తులో నియామకాలు ఉంటాయో లేదో కూడా తెలియదు. ఒకరకంగా ఇది ప్రైవేటీకరణ అనుకోవాల్సిందే. నేరుగా ప్రైవేటీకరణ చేయకుండా ఇలా అద్దె బస్సులతో ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తున్నారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. హైర్ బస్సుల సంఖ్య తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: