కొద్దిరోజులుగా ఉన్న ఉత్కంఠకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెరదించేశాడు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు తాను రాజకీయ పార్టీ పెట్టడంలేదని స్పష్టంగా ప్రకటించేశాడు. కాకపోతే జనాల సమస్యలు తెలుసుకునేందుకు తొందరలోనే బీహార్లో 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. జన్ సురాజ్ కార్యక్రమంలో భాగంగా ఈ పాదయాత్ర ఉంటుందన్నారు.





తన యాత్రలో 17 వేలమంది వివిధ రంగాలకు చెందిన నిపుణులను కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. బీహార్ అభివృద్ధికి తాను ఏమి చేయాలో అంతా చేస్తానంటు మరో ప్రకటన చేశారు. బీహార్ అభివృద్ధికి పీకే ఏమి చేయగలరో ఎవరికీ అర్ధం కావటంలేదు. ఇక్కడ విషయం ఏమిటంటే మూడు రోజుల క్రితం పీకే చేసిన ఒక ట్వీట్ దేశంలోని పార్టీల్లో కలకలం రేపింది. పీకే ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటవుతోందని, పీకే తొందరలోనే జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటు మీడియా ఒకటే ఊదరగొట్టేసింది.





నిజానికి తన ట్వీట్లో ఎక్కడా పార్టీ పెట్టబోతున్నట్లు, రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు డైరెక్టుగా చెప్పలేదు. కాకపోతే ఆ ట్వీట్ ద్వారా రాజకీయాల్లోకి రావాలన్న కోరికను పీకే బయటపెట్టుకున్నారు. దాంతో ఇంకేముంది పీకే రాజకీయ పార్టీ పెట్టేస్తున్నట్లు ప్రచారం జరిగిపోయింది. అయితే చివరకు ఆ ప్రచారమంతా ఉత్త ప్రచారంగా మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తన స్టామినా ఏమిటో పీకేకి బాగా అర్ధమైనట్లుంది.





రాజకీయ వ్యూహకర్త అయినంత మాత్రాన, రాజకీయ ప్రముఖులతో భేటీలైనంత మాత్రాన రాజకీయ నేత కాలేనని పీకేకి బాగా అర్ధమైనట్లుంది. తెరవెనుక రాజకీయ వ్యూహకర్త పాత్రవేరు. ఇదే సమయంలో తెరముందు రాజకీయ నేతల పాత్రవేరు. నేతలు 24 గంటలు జనాలతోనే ఉంటారు. వ్యూహకర్తలెప్పుడు తెరవెనుక మాత్రమే ఉంటారు. వ్యూహకర్త కష్టాన్ని మెచ్చి పార్టీల అధినేతలు ఎవరైనా నామినేటెడ్ పోస్టిస్తే అది వేరేసంగతి. అంతేకానీ పీకేనే పార్టీ పెట్టేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ కొట్టాలంటే అతి జరిగే పనికాదు. ఆ విషయాన్ని పీకే కూడా గ్రహించినట్లున్నారు. అందుకనే తాను పార్టీ పెట్టడంలేదని స్పష్టంగా ప్రకటించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: