తెలంగాణలో రాహుల్, జేపీ నడ్డా పర్యటనలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్ వేశారు. రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారని ఎద్దేవా చేశారు. మొన్న ఒకరు.. నిన్న ఒకరు వచ్చారు..ఏవో డైలాగులు కొట్టి వెళ్లారు. ఎంతమంది వచ్చి వెళ్లినా పనిచేసే నేతలు కావాలన్నారు. ఎవరో చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మమ్మీ అధ్యక్షురాలు.. ఈయన డమ్మీ.. పార్టీలో ఇతని పదవి ఏంటో తెలియదు. అసలు ఏ హోదాలో డిక్లరేషన్ ప్రకటించారో రాహుల్ చెప్పాలన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు రాహుల్.. కాంగ్రెస్ కు ప్రజలు 10ఛాన్సులు ఇచ్చారన్నారు. 50ఏళ్లు అధికారమిచ్చినా ఏం వెలగబెట్టారని ప్రశ్నించారు. మమ్మీ చేతిలో రిమోట్.. డమ్మీ చేతిలో రిమోట్ అన్న చందాన కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు కేటీఆర్.

రాహుల్ తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్ విమర్శలు గుప్పించారు. వరంగల్ లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదు..రాహుల్ సంఘర్షణ సభ అని తెలంగాణ ప్రజలు  అనుకుంటున్నట్టు సెటైర్ వేశారు. కాంగ్రెస్ ను పంజాబ్ రైతులు నమ్మలేదని..అలాంటిది చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ డిక్లరేషన్ ను నమ్ముతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని హరీశ్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీజేపీ దొంగ పార్టీలని.. వాటికి ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ కొత్త మోడల్ తో దేశంలో అభివృద్ధికి శ్రీకారం చుడతారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నిర్వహించిన వరంగల్ డిక్లరేషన్ సభ బూమ్ రాంగ్ అయిందని ఎద్దేవా చేశారు. దిక్కులేని నావలా మారిన ఆ పార్టీతో ఎవరూ పొత్తులు పెట్టుకోరని తెలిపారు. రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప రాహుల్ గాంధీ తెలంగాణకు కొత్తగా చెప్పిందేమీ లేదన్నారు.

ఇక రాహుల్ గాంధీ బోగస్ మాటలను రైతులు నమ్మే స్థితిలో లేరని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎందుకు సమాధానం చేయలేదని ప్రశ్నించారు. పోడు భూముల సమస్య తలెత్తింది కాంగ్రెస్ పాలనలోనే అని ఆరోపించారు. ధరణి ఒక సక్సెస్ స్కీమ్ అని నాసిరకం విత్తనాల సృష్టికర్తలే మీరేనంటూ ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రంలో వ్యవసాయం లాాభసాటిగా మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కాదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ కు.. కాంగ్రెస్ హామీల ఖర్చుకు అసలేమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్..రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఢిల్లీలో రైతుల కోసం ధర్నా చేస్తే ఎక్కడికి పోయారని ప్రశ్నించారు.













మరింత సమాచారం తెలుసుకోండి: