రష్యా, ఉక్రెయిన్ మధ్య సమరం అంతులేని కథలా సాగిపోతూనే ఉంది.. ఉక్రెయిన్‌కు నాటో దేశాల అండదండలు పెరుగుతున్న కొద్దీ రష్యాకు చిక్కులు పెరుగుతున్నాయి. అలాగని రష్యా తగ్గే అవకాశాలూ కనిపించడం లేదు. ఎందాకైనా పోరాటమే అంటూ ఇరు వర్గాలు పంతానికి పోతున్నాయి. ఈ సమయంలో రష్యా ఇప్పుడు ఓ టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతోంది. మే 9 కల్లా యుద్దంలో ఆ టార్గెట్ సాధించాలని పట్టుదలతో ఉంది. ఇంతకీ ఆ టార్గెట్ ఏంటో తెలుసా? ఆ టార్గెట్‌ను మే9 కే ఎందుకు పెట్టుకుందో తెలుసా.. తెలుసుకుందాం..!


మే9 అనేది రష్యా చరిత్రలో ఓ కీలకమైన రోజు.. ఆ రోజు రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో పైచేయి సాధించిన రోజు. అందుకే రష్యా ఆ రోజులు విక్టరీ డేగా జరుపుకుంటోంది. జర్మనీపై ఆనాటి సోవియట్‌ యూనియన్‌ విజయం సాధించినందుకు గుర్తుగా రష్యా సోమవారం విక్టరీ డే జరుపుకోబోతోంది. అందుకే ఈ ఏడాది విక్టరీ డే నాటికి ఉక్రెయిన్‌ లోని కీలక నగరం మరియుపోల్ ను స్వాధీనం చేసుకోవాలని రష్యా పట్టుదలగా ఉంది. అందుకు లక్ష్యం విధించుకుంది. భీకరంగా  పోరు సాగిస్తోంది. విక్టరీ డే నాటికల్లా  మరియు పోల్‌ను పూర్తి స్థాయిలో హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో  రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తోంది.


అయితే.. రష్యా ఎంత పట్టుదలగా ఉందో.. అటు ఉక్రెయిన్ కూడా అంతే తీవ్రంగా ప్రతిఘటన చూపుతోంది. అయితే.. మరియుపోల్‌ను రష్యా  ఇప్పటికే సర్వనాశనం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అంటున్నాడు. ఆక్రమించుకోవడానికి మరియు పోల్‌లో స్టీల్‌ ప్లాంట్‌ తప్ప ఇంకే ముందని ప్రశ్నిస్తున్నాడు. మరియు పోల్ కీలకమైన ఓడ రేవు నగరం. ఇది రష్యా, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉండి కీలకంగా మారింది.


అందుకే ఈ మరియు పోల్‌ విషయంలో రష్యా అంత పట్టుదలగా ఉంది. మరియు పోల్‌ రేవు ప్రాంతాన్ని రష్యా హస్తగతం చేసుకుంటే 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాకు రోడ్డు మార్గం ఏర్పడుతుంది. అందుకే యుద్ధం ఆరంభం నుంచే రష్యా సేనలు మరియుపొల్‌పై దాడులు ప్రారంభించాయి. ప్రత్యేకించి ఇక్కడి స్టీల్ ప్లాంట్‌పై పుతిన్ సేనలు కన్నేశాయి.  మరి విక్టరీ డే నాటికి రష్యా తన టార్గెట్ రీచ్ అవుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: