ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరున్న నటి. ప్రస్తుతం ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అయితే ఉన్నట్టుండి ఎవరో ఒక ఆకతాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత వాట్సప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ లు వచ్చాయి. అన్నీ బూతు మెసేజ్ లే. అసభ్యకరంగా మాట్లాడుతూ వాటిని మెసేజ్ రూపంలో పంపించాడు. అక్కడితో ఆగలేదు. మెసేజ్ ల స్థానంలో బ్లాక్ మెయిలింగ్ కి కూడా దిగాడు ఆ ఆకతాయి. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు. తాను చెప్పినట్టల్లా వినాలని, లేకపోతే తన ప్రతాపం చూపిస్తానంటూ టార్చర్ పెట్టాడు.

చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. వాట్సాప్‌ ద్వారా ఆ నటి హైదరాబాద్ షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మాదాపూర్‌ షీటీమ్స్‌ రంగంలోకి దిగారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వాడిని గుర్తించారు. రాయదుర్గం పోలీసులు వాడిని అడుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రిమాండ్ కి తరలించారు.

షి టీమ్స్.. గ్రేట్ టీమ్స్..
సైబరాబాద్‌ షీటీమ్స్‌ డెకాయ్‌ ఆపరేషన్స్‌ తో ఆకతాయిల భరతం పడుతున్నాయి. చాలామంది సోషల్ మీడియా ద్వారా సినీ నటులు, ఇతర సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు సేకరించి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అయితే బాధితుల్లో కొంతమంది మాత్రమే షీ టీమ్స్ ని ఆశ్రయిస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వాట్సాప్‌, ఈమెయిల్, ఇతర మార్గాల ద్వారా షీ టీమ్స్ కి దాదాపు 355 ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. వాటిలో ఎక్కువ ఫిర్యాదులు అంటే 269 ఫిర్యాదులు వాట్సప్ ద్వారా వచ్చాయి. ఇలాంటి ఫిర్యాదుల్లో ఫోన్‌ వేధింపుల కేసులు 141గా ఉన్నట్టు తెలుస్తోంది. 81 కేసుల్లో విచారణ జరిపి 18 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు పోలీసులు. 119 మందిని మాత్రం వారి పద్ధతి మార్చుకోవాలని బుద్ధి చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి కంటిన్యూ చేస్తే జైల్లో వేస్తామని హెచ్చరించారు.

భయపడొద్దు...
వేధింపులకు గురైన మహిళలు ముందుగా ధైర్యంగా ఉండాలని, భయపడితే అవతలివారికి మరింత అలుసై పోతారని అంటున్నారు పోలీసులు. వెంటనే 100కి గానీ, 94906 17444 నెంబర్ కు వాట్సప్ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. ధైర్యంగా ఉండి, పోలీసులకు ఫిర్యాదు చేస్తే మిగతా పని తాము చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: