పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈసారి ఎలాగైనా వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తామంటున్నారు. అవసరమైతే బీజేపీ పొత్తు నుంచి ఆయన బయటకు వచ్చే అవకాశాలున్నాయని పరోక్షంగా ఇండికేషన్స్ ఇస్తున్నారు. అదే నిజమైతే.. బీజేపీని పక్కనపెట్టి, టీడీపీ-జనసేన కలిస్తే.. వైసీపీకి నష్టమనే చెప్పాలి. ప్రస్తుతానికి పవన్ ప్లానింగ్ ఇదే. ఇలాగే జగన్ ని దెబ్బకొట్టాలనుకుంటున్నారు జన సేనాని.

నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా పవన్ తన వ్యూహాలకు పదును పెట్టారు. పదే పదే వైసీపీ నేతలు పొత్తులు లేకుండా జనసేన పోటీ చేయలేదంటూ రెచ్చగొడుతున్నా.. వారికి కౌంటర్లు ఇచ్చారు పవన్. పొత్తుల గురించి వారు తనకు సూచనలివ్వడం ఏంటని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ప్రజల కోసం, ఏపీ అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానాలతో జనసేన ముందుకెళ్తుందని స్పష్టం చేశారు పవన్. రాష్ట్రంలో ఏదో ఒక అద్భుతం జరిగే అవకాశముందని తాను బావిస్తున్నట్టు చెప్పారు.

వైసీపీ పాలన వల్లే ఇదంతా..?
జగన్ పాలన బాగుంటే, తాను సినిమాలు చేసుకుంటానని, రాజకీయాల జోలికి రానంటూ గతంలో పవన్ చెప్పారు. ఆ తర్వాత జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన రాజకీయాలపై మళ్లీ ఫోకస్ పెట్టారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలకు కూడా సమయం కేటాయిస్తున్నారు. తాజాగా కౌలు రైతులకోసం యాత్రలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీ పాలనలో ఎవరినీ బతకనీయడం లేదని, కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉండట్లేదని చెప్పారు పవన్. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అటు నిరుద్యోగులు కూడా సంతోషంగా లేరన్నారు పవన్. ఉద్యోగులు జీతాలు, సీపీఎస్ రద్దు విషయంలో అసంతృప్తితో ఉన్నారని, ఏపీకి పరిశ్రమలు రావడంలేదని, రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వాన్నంగా ఉందని మండిపడ్డారు. ఈ క్రమంలో కచ్చితంగా ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు పవన్. ఈ విషయాన్ని జనసేన బలంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎవరెవరు కలుస్తారో ఇప్పటి వరకు తనకు తెలియదని, కానీ ఏపీ భవిష్యత్తుకోసం మాత్రం అందరూ కలవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: