పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటారా.. ఎవరితో పొత్తులో ఉన్నారు.. ఎంతకాలం ఉన్నారు.. ఏ రాజకీయ పార్టీతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తారనే విషయం ఆయన వ్యక్తిగతం అంటున్నారు జనసైనికులు. కానీ కానీ వైసీపీ నేతలు మాత్రం పవన్ కల్యాణ్ నుంచి పొత్తు మాటలు వస్తుండే సరికి భయపడిపోతున్నారని, అందుకే కౌంటర్లు ఇస్తూ అందరూ మీడియా ముందుకొస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. జనసేన ఆరోపిస్తున్నట్టుగానే.. వరుసగా మంత్రులు, ఇతర కీలక నేతలు టీడీపీ-జనసేన పొత్తుపై కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్ పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన పొత్తు ప్రయత్నాలను దుయ్యబట్టారు. రాజకీయ వ్యభిచారి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, పవన్ మధ్య మొదట్నుంచీ అక్రమ పొత్తులున్నాయని ఆరోపిస్తున్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబుతో ఎవరు కూటమి కట్టినా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ పక్కన ఉంటూ పవన్, చంద్రబాబుకు సిగ్నల్ ఇస్తుంటే ఆయన్ను ఏమనాలని ప్రశ్నించారు జోగి రమేష్. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీకి నష్టమేమీ లేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వల్ల అందుతున్నాయో ప్రజలకు బాగా తెలుసని వివరించారు జోగి రమేష్. అయితే ఆయన పవన్ పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు ఇటు జనసైనికులు మాత్రం తీవ్రంగా నొచ్చుకున్నట్టు తెలుస్తోంది.

2024 ఎన్నికల్లో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అంటున్నారు మంత్రి జోగి రమేష్. రాబోయే ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని, అయితే అది కొంతవరకు వాస్తవమేనంటున్నారు జోగి రమేష్. వైసీపీ వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువగా.. అంటే 151కి పైగా స్థానాలను చేజిక్కించుకోవడమే ఆ అద్భుతం అని చెప్పారాయన. ఇది కాకుండా పవన్ ఊహిస్తున్నట్టుగా వేరే అద్భుతం ఏదీ జరగదన్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తానంటారని, అలాంటి చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తేల్చి చెప్పారు మంత్రి జోగి రమేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: