తెలిసి తెలిసి జగన్మోహన్ రెడ్డి పెద్ద తప్పు చేస్తున్నారా ? బయటేకాదు పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ చర్చంతా దేనికంటే అధికారపార్టీలో భర్తీ అవ్వబోయే రాజ్యసభ ఎంపీ స్ధానాల ఎంపిక మీదే. జూన్లో వైసీపీకి నాలుగు రాజ్యసభ స్ధానాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న ఆరుస్ధానాలకు తోడు అదనంగా మరో మూడు రాబోతున్నాయి. నాలుగుస్ధానాలు భర్తీ చేయాల్సుండగా మూడు అదనం ఏమిటనే సందేహం వస్తోందా ?





ఇపుడున్న ఆరుగురిలో విజయసాయిరెడ్డికి ఒకస్ధానం ఇప్పటికే రిజర్వు అయిపోయిందనేది పార్టీ వర్గాల సమాచారం. అందుకనే ఇపుడు ఆరుగురు ఎంపీల్లోనే కొత్తగా రాబోయే నాలుగు స్ధానాల్లో ఒకరు ఆల్రెడీ ఉన్నట్లే లెక్క. అందుకనే జూన్ తర్వాత రాజ్యసభలో వైసీపీకి తొమ్మదిమంది ఎంపీలున్నట్లు లెక్కవుతుంది. అయితే ఇక్కడే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





అదేమిటంటే ఇప్పటికే ఉన్న ఆరుగురు రాజ్యసభ ఎంపీల్లో పరిమళనత్వానీ కూడా ఒకరు. ఈయన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు నరేంద్రమోడి, అమిత్ షా లకు అత్యంత సన్నిహితుడు. ఎవరు చెప్పారో లేకపోతే ఎవరు రికమెండ్ చేశారో స్పష్టత లేకపోయినా జగన్ అయితే నత్వానీ ఎంపీగా చేసేశారు. అయితే ఎంపీ అయ్యేటపుడు నత్వానీ సామర్ధ్యం అంతని, ఇంతని ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఈయన వల్ల రిలయన్స్ పెట్టుబడుల వరద పారుతుందన్నారు. అలాగే ఏపీ అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఇకనుండి సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే ప్రచారం జరిగింది.





అయితే నత్వానీ ఎంపీ అయి ఇంతకాలమైనా అప్పట్లో ప్రచారం జరిగినట్లు రిలయన్స్ నుండి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. ప్రతి విషయంలోను ఏపీని కేంద్రం సతాయిస్తునే ఉంది. అంటే నత్వానీ వల్ల జగన్ కు జరిగిన మేలేమిటో తెలీదు కానీ ఏపీకి జరిగిందేమీ లేదని అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలోనే తొందరలో భర్తీ అవ్వబోయే స్ధానాల్లో ఒకటి అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భార్యకు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే జగన్ తప్పు చేస్తున్నారనే టాక్ పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: