ఉక్రోషంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు తానేం చేస్తున్నారో, ఏమి మాట్లాడుతున్నారో కూడా చూసుకోవటంలేదు. చిత్తూరుజిల్లా పర్యటనలో చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలే తాజా నిదర్శనం. పొత్తులపై ప్రస్తావిస్తు వైఎస్సార్ హయాంలో టీఆర్ఎస్, వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోలేదా అంటు జగన్మోహన్ రెడ్డిని నిలదీయటమే విచిత్రంగా ఉంది. ఎప్పుడో 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా వైఎస్సార్ చేసుకున్న పొత్తులకు ఇపుడు జగన్ కు ఏమి సంబంధం ?





రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నదంటే అది పార్టీఅధిష్టానం నిర్ణయం ప్రకారమే జరుగుతుందని చంద్రబాబుకు అంతమాత్రం తెలీదా ? కాంగ్రెస్ పార్టీ జాతీయపార్టీ కాబట్టి ఢిల్లీలోని అధిష్టానం ప్రకారమే జరగాలి. ఇపుడు వైసీపీకి జగనే అధిష్టానం. కాబట్టి అంతా జగన్ ఇష్టప్రకారమే జరుగుతుంది. వైసీపీ ఏర్పడిన తర్వాత ఎవరితో అయినా పొత్తులు పెట్టుకున్నదా ? అన్నది మాత్రమే చంద్రబాబు మాట్లాడాలి. అలా కాకుండా వైఎస్సార్ హయాంలో పెట్టుకున్న పొత్తులకు జగన్ను అడిగితే ఏమి సమాధానం చెబుతారు ?





ఈరోజు రాష్ట్ర రాజకీయాల పరిస్ధితి ఏమిటన్నదే ప్రజలు చూస్తారు. వైసీపీ ఒంటిరిగానే పోటీచేస్తుందని తమకు వ్యతిరేకంగా ఎంతమంది జతకట్టినా తమకొచ్చిన ఇబ్బందిలేదని జగన్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఒంటరిగా పోటీచేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. ఇతర పార్టీలతో పొత్తులు లేందే టీడీపీ పోటీచేయలేందని చంద్రబాబు ఒప్పేసుకున్నారు. ఇక్కడే జనాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవాన్ని. ధైర్యాన్ని జగన్ ఒంటరిపోరాటాన్ని పోల్చి చూసుకుంటున్నారు.





చంద్రబాబు మాట్లాడితే ప్రస్తుత రాజకీయాలు,  ఒంటరిపోరాటం, పొత్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఎప్పటి అంశాలనో ప్రస్తావించి జగన్ను ప్రశ్నించటంలోనే  చంద్రబాబులోని డొల్లతనం కనబడుతోంది. దీన్ని జాగ్రత్తగా గమనిస్తున్న జనాలు కూడా చంద్రబాబు అనుభవాన్ని చూసి నవ్వుకుంటున్నారు. చివరకు చంద్రబాబు ఇలాగైపోయారా అని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే జనాల ముందు చంద్రబాబు నవ్వులపాలవ్వకుండా ఉంటారు.



.

మరింత సమాచారం తెలుసుకోండి: