మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొడాలి నాని కొన్నాళ్లు మీడియాకి దూరంగా ఉన్నారు. అసలు తన సొంత నియోజకవర్గానికే ఆయన కొన్నాళ్లుగా రాలేదనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆయన తొలిసారిగా తన నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ నందిగం సురేష్ తో కలసి హాజరయ్యారు. అప్పుడు చంద్రబాబుని మరో రౌండ్ విమర్శించారు. తాజాగా ఇప్పుడు ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎంతో మాట్లాడిన అనంతరం.. ఆయన మీడియా ముందుకొచ్చారు. మరోసారి చంద్రబాబు, పవన్ ని ఉతికి ఆరేశారు. ఇంతకీ సీఎం దగ్గర జరిగిన పంచాయితీ ఏంటి..? కొడాలి మార్క్ చకమక్కులు మిస్ అయ్యామని సీఎం ఉపదేశమిచ్చారా..? అందుకే బయటకొచ్చి ఆయన తనదైన శైలిలో మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కి చుక్కలు చూపించారా..? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత కొన్నిరోజులు సైలెంట్‌ గా ఉన్నారు కొడాలి నాని. మాజీ మంత్రిగా కంటే, ఎమ్మెల్యేగా పిలిపించుకోవడమే తనకి ఇష్టమని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు నాని. సీఎం జగన్‌ తో సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

చంద్రబాబు అబద్ధాల కోరు, మోసగాడంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎవరెవరు కలసి వచ్చినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. సింహం రెడీగా ఉందని, వారందర్నీ చెల్లాచెదురు చేస్తుందని అన్నారు నాని. వైసీపీకి ఉన్న 50 శాతంపైగా ఓట్లు అలాగే ఉన్నాయని, 2024 ఎన్నికల్లో కూడా వైసీపీదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ నే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారని జోస్యం చెప్పారు.

2019లో మహిళలంతా తనకే ఓటు వేశారని చంద్రబాబు చెప్పుకున్నారని, అదే బాబు ఇప్పుడు జగన్‌ కు వ్యతిరేకత ఉందని చెబుతున్నారని అన్నారు నాని. జగన్‌ పై వ్యతిరేకత ఉంటే చంద్రబాబు సింగిల్ గా పోటీ చేసినా గెలుస్తారని, ఆయనకు మరో పార్టీ అవసరం ఎందుకొచ్చిందని నిలదీశారు. వైసీపీని ఓడించాలంటే, జగన్ ని గద్దె దించాలంటే.. ముందు పవన్, లోకేష్ ఎమ్మెల్యేలుగా గెలవాలి కదా అని సెటైర్లు విసిరారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: