మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. నారాయణ అరెస్ట్ ను కక్ష పూరిత చర్యగా అభివర్ణించారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం.. ప్రజల విమర్శల నుంచి తప్పించుకునేందుకు నారాయణను అరెస్ట్ చేసిందని విమర్శించారు. ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా.. విచారణ జరపకుండా.. ఆధారాలు చూపించకుండా.. ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యానికి నారాయణను ఎలా బాధ్యుడిని చేస్తారని నిలదీశారు.

ఇదిలా ఉంటే.. నారాయణ సంస్థల పర్యవేక్షణలో టెన్త్ మాల్ ప్రాక్టీస్ జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నారాయణ తప్పు చేశారని తేలిందని.. ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు మంత్రిగా కొనసాగించారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఎంత పెద్ద వ్యక్తులకైనా శిక్ష తప్పదని స్పష్టం చేశారు.

నారాయణ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచుకునేందుకు మాల్ ప్రాక్టీస్ చేశారని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ప్రశ్నాపత్రాల కీలను ముందుగానే లోబర్చుకున్న ఇన్విజిలేటర్ల ద్వారా విద్యార్థులకు చేరవేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు పట్టుబడిన నిందితులంతా నారాయణ సంస్థలకు చెందినవారేనని పేర్కొన్నారు. చిత్తూరు తెలుగు పేపర్ లీకైన కేసులో భాగంగా నారాయణను అరెస్ట్ చేశామని వెల్లడించారు.

మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన్ను విచారించేందుకు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టును లీగల్ గా ఎదుర్కొంటామని ఆయన కూతురు  సింధు తెలిపారు. నారాయణ సంస్థల తరఫున తాము ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. అయితే నారాయణను చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు.


చూద్దాం.. నారాయణ అరెస్ట్ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందో.

 













మరింత సమాచారం తెలుసుకోండి: