క్యాడర్ విషయంలో చంద్రబాబునాయుడు, లోకేష్ మాటలు ఒకపట్టాన ఎవరికీ అర్ధం కావటంలేదు. వీళ్ళు క్యాడర్లో ధైర్యం నింపటానికి మాట్లాడుతున్నారో లేకపోతే క్యాడర్ ను దూరం చేసుకుంటున్నారో కూడా పార్టీలోని సీనియర్లకు అర్ధంకావటంలేదు. బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం, భీమిలి, కాకినాడ ప్రాంతాల్లో పర్యటించారు.





ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతు కార్యకర్తలమీద ఎన్నికేసులుంటే వాళ్ళని పార్టీ అంతగా ప్రోత్సహిస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నేతలు, క్యాడర్ పై పెట్టిన కేసుల సమీక్షకు ఒక ట్రిబ్యునల్ వేస్తారట. అప్పుడు వైసీపీ నేతలపైన కూడా కేసులు బుక్ చేసి అందరినీ జైళ్ళకు పంపుతారట. ఇక లోకేష్ మాటలు మరోరకంగా ఉన్నాయి. ఎన్నికేసులుంటే అంత బాగా పనిచేసినట్లట. మినిమం 13 కేసులున్న వాళ్ళతో మాత్రమే తాను మాట్లాడుతానని, అంతకన్నా తక్కువ కేసులున్న వాళ్ళు తనదగ్గరకు రావద్దని నిష్కర్షగా చెప్పేశారు.





ఈమధ్య కొందరు కార్యకర్తలు లోకేష్ దగ్గరకు  వెళ్ళి  తమ మీదున్న కేసుల గురించి ప్రస్తావించారట. అప్పుడు వాళ్ళ కేసులను విన్నతర్వాత తనపైన కూడా ప్రభుత్వం 11 కేసులు పెట్టిందని బదులిచ్చారట. తాను పోరాడుతున్న పద్దతిలోనే క్యాడరంతా పోరాడాలని చెప్పి పంపేశారట. ఇక్కడ చంద్రబాబు అయినా లోకేష్ అయినా ఆలోచించాల్సిందేమంటే క్యాడర్ కు తాము భద్రత కల్పిస్తున్నామా ? లేకపోతే బలిపశువులను చేస్తున్నామా ? అని.






చంద్రబాబు, లోకేష్ మీద కేసులు పడితే వాదించేందుకు ప్రత్యేకించి లాయర్ల బృదమే ఉంది. ఎన్నికోట్లరూపాయలైనా ఖర్చకు ఢోకా ఉండదు కాబట్టి ఎంతకాలమైనా పోరాటాలు చేస్తారు. కానీ క్యాడర్ పరిస్ధితి అలాకాదు. కార్యకర్తపైన కేసుపెట్టి జైలుకు పంపితే అతనిపైన ఆధారపడున్న కుటుంబం పరిస్ధితేంటి ? కేసులో నుండి బయటపడాలంటే లాయర్ ఫీజు ఎవరు చెల్లించాలి ? ఎంతకాలం చెల్లించగలరు ? కార్యకర్త జైలుకు వెళితే కార్యకర్త కుటుంబాన్ని ఎవరు పోషించాలి ? ఇవేమీ ఆలోచించకుండా కేసులు పెట్టనివ్వండి, ట్రిబ్యునల్ పెడతాం, పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళని జైలుకు పంపుతామంటున్నారు. అప్పటివరకు కార్యకర్తల పరిస్ధితేంటి ? టీడీపీ పవర్లోకి రాకపోతే వాళ్ళ భవిష్యత్తేంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: