ఇపుడిదే విషయాన్ని జనాలు పదే పదే చర్చించుకుంటున్నారు. లేటెస్టు విషయం ఏమిటంటే నారాయణ విద్యాసంస్ధల అధిపతి, మాజీమంత్రి పొంగూరు నారాయణను పోలీసులు అరెస్టు చేయటం, ఆయన బెయిల్ పై వచ్చేయటం. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ స్కూలు పాత్ర కీలకమని ఏపీసీఐడీ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. అందులో నారాయణ పాత్రను నిగ్గుతేల్చాలని పోలీసులు గట్టిగా అనుకున్నారు.





అందుకనే నారాయణ కోసం ఐదురోజుల వెతికి వెతికి మరీ హైదరాబాద్ లో పట్టుకున్నారు. తీరాచూస్తే ఏమైంది ? వెతికినంత కాలం, అరెస్టుచేసి హైదరాబాద్ నుండి చిత్తూరు కోర్టుకు తీసుకొచ్చినంత సేపు కూడా నారాయణను తమ కస్టడీలో ఉంచుకోలేకపోయారు. పోలీసులు నారాయణను ఇలా కోర్టులో ప్రవేశపెట్టడం, కోర్టు ఆయనకు అలా బెయిల్ ఇచ్చేయటం చకచకా జరిగిపోయాయి.





అంటే ప్రశ్నపత్రాల లీకేజీలో పోలీసులు నారాయణను విచారించటం సాధ్యంకాదని తేలిసోయింది. కోర్టు నారాయణకు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఇక మళ్ళీ ఆయన్ను విచారణ పేరుతో అదుపులోకి తీసుకోవటం పోలీసుల వల్లకాదు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు లేదా ప్రభుత్వం ఏమి సాధించినట్లు ? కొండను తవ్వి చివరకు ఎలుకను కూడా పట్టుకోలేకపోయింది. చంద్రబాబునాయుడు లేదా తమ్ముళ్ళకు సంబంధించిన అనేక కేసుల్లో  పోలీసులు ఇలాగే ఫెయిలవుతున్నారు.





గడచిన మూడేళ్ళల్లో పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఒక్కటంటే ఒక్కదానిలో కూడా తమ్ముళ్ళను విచారణకు అదుపులో తీసుకోలేకపోయారు. అచ్చెన్నను అరెస్టు చేస్తే హ్యాపీగా ఆసుపత్రిలో పడుకునే బెయిల్ తెచ్చుకున్నారు. దూళిపాళను అరెస్టు చేస్తే కొద్దిరోజులు రిమాండ్ లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చేశారు. రఘురామకృష్ణంరాజును అరెస్టుచేస్తే ఆసుపత్రిలో ఉండే బెయిల్ పై బయటకు వచ్చేశారు. స్వర్ణా కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదంలో 12 మంది కాలిచనిపోతే దాని అధిపతి డాక్టర్ రమేష్ ను అసలు అరెస్టే చేయలేకపోయారు.





చివరకు అమరావతి ల్యాండ్ స్కామని కేసులు పెడితే కోర్టు విచారణకే ఒప్పుకోలేదు. చంద్రబాబు అండ్ కో మీద కేసులు పెట్టినా నిలవ్వని తెలిసి పోలీసులు మరెందుకు కేసులని, అరెస్టులని, విచారణని హడావుడి చేసి కోర్టుల్లో భంగపడుతున్నారు ?  కోర్టులో తేల్చుకోలేని విషయాలను ప్రజాకోర్టులో తేల్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి అవకాశముంది. చంద్రబాబు అండ్ కో మీద కేసులు పెట్టినా నిలిచేది కాదని మామూలు జనాలకు కూడా బాగా తెలుసు.  కాబట్టి జగన్ కోర్టుల సంగతి వదిలేసి ప్రజాకోర్టులో గెలుపుపైన మాత్రమే దృష్టిపెట్టడం బెటర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: