సొంతమనుషులతో పాటు ప్రత్యర్ధులకు, సొంతపార్టీలోని గీత దాటివారికి కూడా జగన్మోహన్ రెడ్డి కచ్చితమైన సిగ్నల్ పంపుతున్నారు. అదేమిటంటే కజిన్ బ్రదర్ వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు. కొండారెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపల్లి మండలానికి పార్టీ ఇన్చార్జి. మండలంలో పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరగాలన్నా కొండారెడ్డి అనుమతి లేనిదే జరిగేందుకు లేదు. మండలస్ధాయి నేతకు ఎందుకింత ప్రాధాన్యత ?





ఎందుకంటే ఈయన స్వయంగా జగన్ కు కజిన్ బ్రదర్ కాబట్టే. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతిలకు కూడా అత్యంత సన్నిహితుడు. అంతటి వ్యక్తిపై బెదిరింపుల ఫిర్యాదుపై పోలీసులు కేసు పెట్టడమే చాలా గొప్ప.  అలాంటిది ఏకంగా అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టి ఏకంగా రిమాండుకే తరలించటమంటే మామూలుగా అయితే ఎవరు ఊహించలేరు. ఎందుకంటే రాజుకన్నా రాజుగారి బావమరిది ఇంకా బలవంతుడు కదా.





బావమరిది కాకపోయినా కజిన్ హోదా కాబట్టి కొండారెడ్డి కూడా అలాగే అనుకునుంటారు. కానీ జగన్ దగ్గర అలాంటి పప్పులుడకలేదు. అందుకనే చివరకు జైలుపాలై మొత్తానికి బెయిల్ మీద బయటకొచ్చారు. ఇపుడు హఠాత్తుగా కొండారెడ్డిని జిల్లానుండే బహిష్కరించే ఆలోచన జరుగుతున్నది. దీంతో పార్టీలోని అసంతృప్త నేతలు, ప్రత్యర్ధిపార్టీల్లోని నేతలు ఒక్కసారిగా అలర్టయ్యారు. సొంత కజిన్ విషయంలోనే ఇంత కఠినంగా ఉన్న జగన్ ఇక యాక్షన్ చేస్తే ఎలా ఉంటారనేందుకు ప్రత్యర్ధులకు సిగ్నల్లాగ ఉపయోగపడింది.





ఇదే సమయంలో పార్టీలోని కొందరు అసంతృప్తులకు కూడా ఇది సిగ్నలే. సన్నిహితులు కదాన్న ఉద్దేశ్యంతో ఓవర్ యాక్షన్ చేస్తే ఫలితం ఎలాగుంటుందో కొండారెడ్డి విషయంలో చూస్తున్నారు. తమకు కూడా ఆ పరిస్దితి రాకూడదంటే తమ పరిధిలో ఉండాల్సిందే అని ఎవరికి వారుగా జాగ్రత్తగా ఉండేలా చేస్తోంది కొండారెడ్డి ఉదంతం. కొండారెడ్డిపై కేసు, అరెస్టు ఇపుడు బహిష్కరణ విషయంలోనే జగన్ ఇంత కఠినంగా ఉన్నారంటే ఇక ప్రత్యర్ధి పార్టీల నేతలను ఎందుకు ఉపేక్షిస్తారు ?  

మరింత సమాచారం తెలుసుకోండి: