ఏపీలో రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతలకు మేలు చేసే కార్యక్రమం మొదలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయని చెబుతోంది. అదే సమయంలో రైతు భరోసా కేంద్రాలపై టీడీపీ కూడా విమర్శలు సంధిస్తోంది. ఈ విమర్శలు ఎలా ఉన్నా ఇప్పుడు విదేశాల్లో కూడా రైతు భరోసా కేంద్రాలు వస్తున్నాయనే వార్త నిజంగా ఏపీ గర్వించదగ్గదే. ఇథియోపియాలో త్వరలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి.

ఇటీవల జరిగిన ఆసియా–ఫసిపిక్‌ రీజియన్‌ సమ్మిట్‌ లో రైతు భరోసా కేంద్రాల గురించిన చర్చ మొదలైంది. రైతు భరోసా కేంద్రాలు, అందులో అందుతున్న సేవల గురించి ప్రపంచ బ్యాంకుకి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం వివరించింది. ఆర్బీకే తరహా వ్యవస్థను ఇథియోపియాలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, రైతులకు మంచి జరుగుతుందని, వ్యవసాయ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించవచ్చని సూచించింది. ఆర్బీకేల ఏర్పాటుకి ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందని, వాటి ఏర్పాటుకి అయ్యే ఖర్చుని భరిస్తామని కూడా తెలిపింది. దీంతో ఇథియోపియా-వరల్డ్ బ్యాంక్ ఈమేరకు ఓ ఒప్పందం చేసుకోబోతున్నాయి.

ఏపీలో ఇథియోపియో బృందం త్వరలో పర్యటించబోతోంది. ఆర్బీకే సేవలు, వాటి కార్యక్రమాలపై అధ్యయనం చేస్తారు ఇథియోపియా వ్యవసాయ శాఖ ప్రతినిధులు. ఆ తర్వాత రాష్ట్ర ప్రతినిధి బృందం వారికి మరింత వివరించి చెబుతారు. వారికి అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. ఆర్బీకేల సాంకేతికతపై కూడా అవగాహన కల్పిస్తారు. సీఎం జగన్ మానస పుత్రికలైన ఆర్బీకేలకు అంతర్జాతీయ ఖ్యాతి రావడం సంతోషంగా ఉందని అంటున్నారు అధికారులు. ఇటీవలే ఐక్యరాజ్యసమితి ఛాంపియన్ అవార్డుకి కూడా ఆర్బీకేలు నామినేట్ అయ్యాయి. తాజాగా వీటి గురించి వరల్డ్ బ్యాంక్ కి కూడా కేంద్ర ప్రతినిధి బృందం గొప్పగా చెప్పడంతో ఇథియోపియాలో త్వరలో ఆర్బీకేలు మొదలయ్యే అవకాశముంది. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా నిలవడం నిజంగా సంతోషించదగ్గ విషయమే కదా..


మరింత సమాచారం తెలుసుకోండి:

rbk