సిటీలో రెండు మూడు రోజులుండాలంటే.. రైలులో వచ్చినా, బస్సులో వచ్చినా ప్రైవేట హోటల్స్ ని ఆశ్రయించాల్సిందే. కానీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు రైల్వే సంస్థ బంపర్ ఆఫర్ ఇస్తోంది. రైల్వే ప్రయాణికులు సిటీ టూర్ కి వచ్చేటప్పుడు స్టేషన్లోనే బస చేయొచ్చు. రాను, పోను ప్రయాణం రైలులోనే ఉంటే వీరికి మరింత ఉపయోగం. ఎంచక్కా ప్రయాణానికి ముందే హోటల్ నుంచి బయటకొచ్చినట్టు.. రెస్ట్ రూమ్ నుంచి నేరుగా ప్లాట్ ఫామ్ పైకి వచ్చేయొచ్చు. ప్రయాణం సమయంలో హోటల్ ని చెకవుట్ చేయాలని, ఇతర వాహనాల్లో రైల్వే స్టేషన్ కి వచ్చి పడిగాపులు కాయాలనే ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తోంది.

ఇటీవలే దక్షిణమధ్య రైల్వే రిటైరింగ్‌ రూమ్‌ లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్‌ లలో ముందుగా ఈ రెస్ట్ రూమ్ లు అందుబాటులోకి తెస్తోంది. గతంలో ఉన్నట్టుగా ప్రయాణికుల విశ్రాంతి ప్రాంగణం అన్నట్టు.. అందరూ ఒకే రూమ్ లో ఉండేట్టు కాకుండా వీటిలో చాలా మార్పులు చేసారు. సుమారు 30 విశాలమైన విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. గదులతోపాటు డార్మిటరీలు ప్రయాణికులకోసం సిద్ధం చేసారు. వేసవిలో వచ్చే ప్రయాణికులు, టూరిస్ట్ ల కోసం ఈ ఏర్పటు చేసినట్టు తెలిపారు రైల్వే అధికారులు.

ధర తక్కువ..
స్టార్ హోటల్స్, లాడ్జీలకంటే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉండే రిటైరింగ్ రూమ్ లు తక్కువ ధరకు లభిస్తాయి. వీటికి ఇప్పటికే చాలా డిమాండ్ ఉంది. ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి రిటైరింగ్ రూమ్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. హోటల్స్, లాడ్జిలతో పోల్చి చూస్తే వీటిలో సౌకర్యాలు ఎక్కువ, అద్దె తక్కువ. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లనుంచి ప్రతి రోజు సుమారు 2లక్షలమంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవలు కావడంతో రద్దీ మరింతగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రిటైరింగ్ రూమ్స్ ని అందుబాటులోకి తెస్తున్నారు. వీటితో రైల్వేకి మరింత ఆదాయం సమకూరే అవకాశముంది. అటు ప్రయాణికులకు కూడా బయట హోటళ్లు, లాడ్జిలకు పెట్టే ఖర్చు కలిసొస్తుంది కూడా. పైగా ప్రయాణ సమయానికి హడావిడిగా పరిగెత్తే అవసరం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: