చాలాకాలంగా నేతల వలసలపైన ఏపీ బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకున్నది. అయితే ఆ ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. ఎలాగంటే చెప్పుకోతగ్గ నేతలెవరు బీజేపీలో చేరటంలేదు. పోని చేరిన నేతలేమన్నా గట్టివాళ్ళా అంటే కాదు. పైగా ఉన్న నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేయటమే నిదర్శనం. రావెల ఎంతో ఆశతో బీజేపీలో చేరారు.





చాలాకాలం పార్టీలో ఉన్న రావెల చివరకు ఏమనుకున్నారో ఏమోగాని సోమవారం రాజీనామా చేసేశారు. రావెలతో మొదలైన రాజీనామా పర్వ ఇంకా కంటిన్యు అవుతుందో లేదో తెలీదు. కొత్తనేతలు చేరకపోగా ఉన్న నేతలు కూడా బయటకు వెళ్ళిపోవటం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. అంటే ఏపీలో బీజేపీకి అసలు సీనే లేదని అందరికీ అర్ధమైపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





ఒకవైపు తెలంగాణాలో బీజేపీ నేతలు మాంచి దూకుడుమీదున్నారు. అధికారంలోకి వస్తుందో లేదో తెలీదు కానీ వచ్చేస్తామంటు నానా రచ్చ చేస్తున్నారు. తెలంగాణా చీఫ్ బండి సంజయ్ నేతృత్వంలో కమలనాదులు కేసీయార్ టార్గెట్ గా చేయని రచ్చలేదు. ప్రతిరోజు ఏదో టాపిక్ తీసుకోవటం నానా గోలచేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. దాంతో జనాల్లో కాస్త ఊపువస్తున్నట్లే  ఉంది. తెలంగాణా కాంగ్రెస్ నుండి కొందరు కీలకమైన నేతలు చేరటంతో ఒక్కసారిగా బీజేపీకి ఊపొచ్చింది.





మరీ పరిస్దితి ఏపీలో ఎందుకు కనబడటంలేదు ? బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఎంతసేపు మీడియా సమావేశంపెట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని, జనసేన పొత్తుపైన ఆధారపడటం తప్ప మరో కార్యక్రమం చేయటంలేదు. పెద్ద నేతలుగా చెప్పుకునే వాళ్ళల్లో కనీసం పదిమంది కూడా మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయలేదు. బీజేపీ నేతల్లో అత్యధికులు మీడియా సమావేశాలు, టీవీ డిబేట్లలో తప్ప క్షేత్రస్ధాయిలో కనబడటంలేదన్నది వాస్తవం. అందుకనే బీజేపీకి నిజంగా అంతసీన్ లేదన్న విషయం అందరికీ అర్ధమైపోయినట్లుంది. మరి మొదలైన రాజీనామాలు రావెలతో ఆగుతుందా లేక ఇంకా ఉన్నాయా అన్నది తొందరలోనే తేలుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: