ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కేఏపాల్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. పవన్ కల్యాణ్ కి కూడా అమిత్ షా దర్శనం అంత తేలికగా దొరకదు. అలాంటిది పాల్ అడగగానే ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతే కాదు, ఆయన వెళ్లి తెలంగాణలో తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేయడమే కాదు, ఏపీ, తెలంగాణ రాజకీయాలు కూడా మాట్లాడి వచ్చారట. ఆ తర్వాత ఇప్పుడు ఏపీలో చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

2019 ఎన్నికల ముందు కూడా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బాగానే హడావుడి చేశారు. ప్రజాశాంతి పార్టీని స్థాపించి ఏపీలో పలు నియోజకవర్గాల్లో ఆయన అభ్యర్థులను పోటీకి నిలిపారు. అయితే చివరకు ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసిన ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్ దక్కలేదనుకోండి, అది వేరే విషయం. ఆ ఎన్నికల తర్వాత కనీసం రిజల్ట్ అనాలసిస్ చేసుకోకుండానే కేఏపాల్ మాయమయ్యారు. అమెరికా ఎన్నికలు, రష్యా యుద్ధం.. ఇలా అప్పుడప్పుడు అంతర్జాతీయ అంశాలతో మీడియాలో కనిపిస్తుండేవారు పాల్. ప్రపంచ దేశాల అధ్యక్షులంతా తనకు తెలుసని, యుద్ధాలు ఆపేయిస్తానని, శాంతి స్థాపిస్తానంటూ చెబుతుండేవారు. ఈ మాటలతో బాగా పాపులర్ అయ్యేవారు పాల్.

ఇటీవల మళ్లీ ఆయన రాజకీయ రంగంపై కనపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలతో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు పాల్. ఈ సారి ప్రతిపక్ష నేత చంద్రబాబుని పాల్ టార్గెట్ చేశారు. చంద్రబాబు వల్లే మాల, మాదిగలు విడిపోయారని, వారిమధ్య చిచ్చు పెట్టారని, రెండు వర్గాలుగా మార్చారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగ వర్గాల మధ్య చిచ్చుపెట్టిన పాపం చంద్రబాబుకే తగులుతుందని విమర్శించారు పాల్. తాను బీజేపీతో ఉంటున్నట్టు, బీజేపీ మనిషిగా ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని కూడా అంటున్నారు పాల్. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్లంతా తన వెనకే ఉన్నారని చెబుతున్నారు పాల్. మొత్తానికి పాల్ స్ట్రాటజీ మార్చారు. ఎన్నికల టైమ్ కి ఏదో ఒక విధంగా తన ఉనికి చూపించడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: