చంద్రబాబునాయుడును చూస్తుంటే గురివిందగింజ గుర్తుకొస్తోంది. అసలు తన బాధేమిటో కూడా ఎవరికీ అర్ధం కావటంలేదు.  ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం కడపజిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో జనాలను ఉద్దేశించి వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్ధులపై విమర్శలు చేశారు. తమ పార్టీ తరపున ఎవరిని రాజ్యసభ ఎంపీ అభ్యర్ధులుగా ఎంపికచేయాలన్నది పూర్తిగా జగన్ ఇష్టం. ఆ విషయం బాగా తెలిసినా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.





జగన్ ఎంపికచేసిన నలుగురు రాజ్యసభ ఎంపీ అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణా వాళ్ళుండటం ఏమిటని చంద్రబాబు పెద్ద అభ్యంతరమే చెప్పారు. ఎందుకుండకూడదో చెప్పమంటే మళ్ళీ చంద్రబాబు నోరులేవటంలేదు. జగన్ ఎంపికచేసిన అభ్యర్ధులపై చంద్రబాబు ఆక్షేపించాల్సిన అవసరమేలేదు. ఏపీ నుండి ఇద్దరినీ తెలంగాణా నుండి ఇద్దరిని రాజ్యసభకు ఎంపికచేసి జగన్ సమన్యాయం చేశారంటు ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది.





జగన్ చేసింది నిజంగానే తప్పయితే మరి ఇదే తప్పు ఒకపుడు చంద్రబాబు కూడా చేశారుకదా. 2014-19 మధ్యలో ఏపీ కోటానుండి టీడీపీ తరపున మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సురేష్ ప్రభును ఎలా చంద్రబాబు పంపారు ? అలాగే నిర్మలా సీతారామన్ ను ఎందుకు ఎంపికచేసినట్లు ? అంటే చంద్రబాబు చేస్తే మాత్రం కరెక్టు అదే పనిని ఇంకెవరైనా చేస్తే మాత్రం రాంగు. మొత్తానికి నీతులన్నవి చెప్పటానికే కానీ తాను ఆచరించటానికి కాదని చంద్రబాబు నిరూపించారు.






అయినా తెలంగాణాకు చెందిన నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు ఎంపిక చేస్తే అసలు మాట్లాడాల్సిన అవసరం చంద్రబాబుకు లేనేలేదు. అయినా ఎందుకు మాట్లాడుతున్నారు ? ఎందుకంటే బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య వైసీపీలో చేరి రాజ్యసభ ఎంపీ అయినందువల్ల పార్టీకి ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భయం పెరిగిపోతున్నట్లుంది. పార్టీతో ఉన్న కొంతమంది బీసీలు కూడా కృష్ణయ్య కారణంగా వైసీపీలోకి వెళ్ళిపోతారేమో అనే ఆందోళనే చంద్రబాబులో కనబడుతోంది. లేకపోతే అనవసరమైన మాటలెందుకు ?

మరింత సమాచారం తెలుసుకోండి: