ప్రతిపక్షాలన్నీ కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించటం చాలా తేలికని చాలామంది పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ శపథం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోటీచేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వస్తారని చంద్రబాబునాయుడు భయపడుతున్నారు. జగన్ అంటే వీళ్ళకున్న భయమే బహుశా టీడీపీ, జనసేనను కలుపుతాయోమో చూడాలి. లోలోపల ఎంతభయం ఉన్నా బయటపడేందుకు మాత్రం ధైర్యం చేయటంలేదు.






అయితే దీనికి బీజేపీ అడ్డంకిగా మారుతుందేమో అన్న భయంకూడా ఉంది వీళ్ళల్లో. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన కావచ్చు లేదా టీడీపీ+జనసేన పార్టీలమధ్య పొత్తు దాదాపు ఖాయమైపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. సరే మూడు పార్టీలు పొత్తుపెట్టుకున్నా లేదా రెండుపార్టీల మధ్యే పొత్తున్నా మౌళికంగా కొన్ని సమస్యలున్నది వాస్తవం. జగన్ అంటే భయాన్ని పక్కనపెట్టేస్తే పై పార్టీల మధ్యే సమస్యలున్నాయి. మరి వాటిని ఎలాగ అధిగమిస్తాయనేది ఆసక్తికరం.





ఇంతకీ ఆ సమస్యలు ఏమిటంటే పొత్తుపెట్టుకున్న పార్టీల్లో ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేయాలనేది కీలకం. అలాగే పోటీచేయబోయే నియోజకవర్గాలెన్ని అనే నెంబర్ ఖాయమైన తర్వాత ఆ నియోజకవర్గాలేవి అనేది ఇంకా పెద్ద సమస్య. ఎందుకంటే జనసేన నేతలేమో తమకు 60 సీట్లు కావాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఓట్లశాతం ప్రకారమే  జనసేనకు సీట్లు కేటాయిస్తామని ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.






అంటే జనసేన ఆశిస్తున్న సీట్లకు, టీడీపీ ఇస్తామని చెబుతున్న సీట్ల సంఖ్యకు ఏమాత్రం పొంతనలేదు. పైగా రెండుపార్టీలు కూడా పోటీచేయాలని అనుకుంటున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అవికూడా ఉభయగోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే ఎక్కువ. ఇక ఈ రెండు పార్టీలకుతోడు బీజేపీ కూడా కలిసిందనుకోండి గందరగోళం మరింతగా పెరగటం ఖాయం. కాబట్టి పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన కూటమి గెలుస్తుందనే గ్యారెంటీ లేదు. మరి చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.





మరింత సమాచారం తెలుసుకోండి: