ఎవరైనా, ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయంలో మిమ్మల్ని లంచం అడిగారా..? అయితే వెంటనే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి. గతంలో ఏసీబీ అధికారుల ఫోన్ నెంబర్లు డిస్ ప్లే చేసేవారు, వారిని నేరుగా కలసి కూడా ఫిర్యాదులు చేసేవారు ప్రజలు. ఇప్పుడు యాప్ ద్వారా వెంటనే పనైపోతుంది. ఈ యాప్ లో ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే లంచగొండుల భరతం పడతారు అధికారులు.

అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు దిశ లాగా మొబైల్‌ యాప్‌ రూపొందించాలని సీఎం జగన్ ఇటీవల ఏసీబీ అధికారులకు సూచించారు. దీంతో ఏసీబీ  ‘14400 యాప్‌’ ను తెరపైకి తెచ్చింది. లంచగొండుల పాలిట సింహస్వప్నంలా దీన్ని రూపొందించామని చెబుతున్నారు అధికారులు. దీని ఫీచర్లు అలా ఉంటాయని అంటున్నారు. త్వరలోనే ఈ యాప్ ని సీఎం జగన్ చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  

వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ అందరిలో దైర్యాన్ని నింపింది. దిశ యాప్ ద్వారా సత్వర సమస్యలకు పరిష్కారం లభిస్తోందని అంటున్నారు ప్రజలు. దిశ యాప్ వచ్చిన తర్వాత మహిళల్లో కూడా ఆత్మ విశ్వాసం పెరిగింది. పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన పనిలేకుండానే దిశ యాప్ ద్వారా తమ ఫిర్యాదులను నేరుగా అధికారులకు చేరవేసే సదుపాయం ఉంది. ఈ యాప్‌ పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో.. ఇప్పుడు ఏసీబీ కూడా అదే రూట్ ఎంచుకుంది. సీఎం జగన్ సూచనతో కొత్త యాప్ తీసుకొస్తున్నారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ దీన్ని తయారు చేశారు అధికారులు.

అవినీతిపై ఫిర్యాదులు చేసేవారికోసం కొన్నాళ్ల క్రితం 14400 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది ఏసీబీ. అయితే ఈ నెంబరులో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. అధికారులకు తగిన సాక్ష్యాధారాలు చేరవేయడం కుదరదు. ఇప్పుడు యాప్ ద్వారా ఫిర్యాదుదారులు సాక్ష్యాధారాలు కూడా అధికారులకు చేరవేయొచ్చు. ఆడియో, వీడియో రూపంలో సాక్ష్యాధారాలను యాప్ ద్వారా నేరుగా అధికారులకు పంపించే అవకాశముంది. దీంతో లంచగొండులు అడ్డంగా బుక్ అయిపోయినట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి:

acb