‘బొంకరా బొంకరా పోలిగా అంటే మాఊరు మిరియాలు తిటికాయంత సైజు అన్నాడట’ వెనకటికి. చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న మాటలు కూడా అచ్చంగా అలాగే ఉన్నాయి. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో వైసీపీని తెలుగుదేశంపార్టీ బుల్డోజర్లా తొక్కుకుని వెళ్ళిపోతుందన్నారు. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదని ఇప్పటికే తేలిపోయిందట.





అందుకనే వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్లో టెన్షన్ పెరిగిపోతోందట. తన కార్యక్రమానికి హాజరవుతున్న జనాలను చూసిన తర్వాత గెలుపుపై తనకు పూర్తి నమ్మకం వచ్చేసిందన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నదంతా పూర్తిగా పార్టీ నేతలు, కార్యకర్తలే.  అంటే చంద్రబాబు కార్యక్రమంతో మామూలు జనాలకు ఎలాంటి సంబంధంలేదు. ఈ కార్యక్రమంలో బాదుడే బాదుడు అని గట్టిగా అరవమని చంద్రబాబు అన్నపుడు కార్యకర్తల నుండి పెద్దగా స్పందన కూడా రాలేదు. దీనికి కూడా చంద్రబాబు ఉడుక్కున్నారు. 





దాంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయి మీకన్నా బయటజనాలే గట్టిగా అరుస్తున్నారని అన్నతర్వాత మాత్రమే కార్యకర్తలు బాదుడే బాదుడు అంటు గట్టిగా అరిచారు. సరే మళ్ళీ బుల్డోజర్ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీని టీడీపీ బుల్డోజర్లా తొక్కేయటం మాట పక్కనపెడదాం. మొన్నటి ఎన్నికల్లో జగన్ తొక్కిన తొక్కుడికి టీడీపీ ఇంకా లేవలేదు. తాను లేచి నిలబడాలంటే పక్కన ఏదో పార్టీ సాయం ఉండాల్సిందే అన్న విషయం అర్ధమైపోయే పొత్తుల కోసం ఆరాటపడుతోంది.






పొత్తుంటే తప్ప వచ్చే ఎన్నికల్లో పోటీచేయటం కష్టమని అర్ధమైపోయినట్లుంది. అందుకనే పదే పదే జగన్ కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో టీడీపీతో అందరు కలిసిరావాలంటు అందరినీ బతిమలాడుకుంటున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ చీ కొడుతున్నా కమలంపార్టీకి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా గట్టిగా మాట్లాడే ధైర్యం చేయటంలేదు. ఇలాంటి చంద్రబాబు బుల్డోజరని, వైసీపీని తొక్కుకుంటు వెళ్ళిపోతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటమే విచిత్రంగా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: