తెలంగాణలో 30 సీట్లలో పోటీ చేస్తామన్నారు పవన్ కల్యాణ్. అయితే ఆయన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ని, ఆయన విధానాలను విమర్శించాలి. ఇటీవల పవన్ కల్యాణ్.. కేసీఆర్ వ్యవహారంలో పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. సినిమాల విషయం కావొచ్చు, ఇంకేదైనా లావాదేవీలు ఉండొచ్చు కానీ పవన్ మాత్రం కేసీఆర్ ని ఇటీవల కాలంలో పల్లెత్తు మాట అనలేదు. ఆ మాటకొస్తే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆయన వేలు పెట్టలేదు. కేవలం కేసీఆర్ ని తిట్టాల్సి వస్తుందేమోనన్న ఒకే ఒక్క కారణంలో 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మనసు మార్చుకున్నారు. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని అన్నారు.

జనసేన తరపున 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెడతానంటున్నారు పవన్ కల్యాణ్. ప్రతి నియోజకవర్గంలో తమకు కార్యకర్తల బలం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఏపీకి మాత్రమే ఈ పొత్తు పరిమితం అనుకున్నా, తెలంగాణలో ఎలా పోటీ చేస్తారో చూడాలి. 2023లో తెలంగాణలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని 2024లో ఏపీలో సయోధ్య అంటే ఎవరూ నమ్మరు. అందుకే తెలంగాణలో కూడా బీజేపీతో జనసేన కలిసి నడిచే అవకాశముంది.

టీఆర్ఎస్ పై స్టాండ్ ఏంటి..?
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. కచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ పై విమర్శలు చేయాలంటే కేసీఆర్ పాలనపై వేలెత్తి చూపించాలి. కేటీఆర్ ని కూడా విమర్శించాలి. మరి పవన్ కల్యాణ్ ఇంత సాహసం చేస్తారా అనేదే అనుమానం. అసలు పవన్ కల్యాణ్ తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పలేదు. గతంలో పలు ఎన్నికలను, ఉప ఎన్నికలను వద్దనుకున్న పవన్, సడన్ గా 2023 నాటికి బరిలో దిగుతామంటే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. గతంలో బీజేపీ మాటలతో పవన్ పోటీనుంచి వెనక్కి తగ్గారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో కూడా అలాగే బీజేపీకి సపోర్ట్ చేశారు. కానీ ప్రచారం చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తానంటే బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ కల్యాణ్ ని ప్రచారానికి వాడుకుంటుందా అనే అనుమానం కూడా ఉంది. మరి పవన్ కల్యాణ్ ఆయా విషయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: