ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ వర్సెస్‌ వైసీపీ కూడా మొదలైంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం విషయంలో ఈ రెండు పార్టీల మధ్య రగడ మొదలైంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏప్రిల్, మే నెలల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే... వైసీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అబద్ధాల ప్రచారమని బీజేపీ నేతలు అంటున్నారు. తాజాగాఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివరణ ఇచ్చారు.


వైసీపీ నేతల విమర్శలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించి... వాస్తవాలను బయటపెట్టిన అనంతరం మంత్రి కారుమూరి రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు ఉచిత బియ్యం సరఫరా నిలిపివేసిందని అంగీకరించారని సోము వీర్రాజు అంటున్నారు. మొన్నటి వరకు వైసీపీ  ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం పంపిణీకి బియ్యం ఇవ్వడం లేదంటూ అసత్యాలు ప్రచారం చేశారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 2.68 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత బియ్యం ఇవ్వలేదని మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివని సోము వీర్రాజు ధ్వజమెత్తారు.


2.68 కోట్ల మంది లబ్ధిదారులున్న 86 లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని ఎందుకు దూరం చేయాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. 86 లక్షల మంది అర్హులైన కార్డ్ హోల్డర్లు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మార్చి, 2022 వరకు 24 నెలల పాటు ఉచిత బియ్యాన్ని పొందారని సోము వీర్రాజు గుర్తు చేశారు. ఏప్రిల్ నుండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నుండి ఉచిత బియ్యం సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలిపివేసిందో చెప్పాలని సోము వీర్రాజు నిలదీశారు.


ఇక బియ్యం రకం విషయానికొస్తే, ఏపి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల ఆహార సబ్సిడీని అందజేస్తున్నా... ఈ పథకం కింద ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: