ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమధ్య జైలుకొళ్లొచ్చిన తర్వాత కాస్త స్పీడ్ తగ్గించినా.. మళ్లీ ఇప్పుడు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో అధికార పార్టీ ఆయన వ్యవహార శైలితో పూర్తిగా ఇరుకునపడుతోంది. పార్టీలో ఉంటూ, పార్టీ ఎంపీగా ఆ హోదాలో ఉంటూ.. పార్టీనే విమర్శిస్తుండే సరికి వైసీపీకి ఏం చేయాలో అర్థం కావడంలేదు. దీంతో అనర్హత వేటు పిటిషన్ ని మళ్లీ తెరపైకి తెచ్చారు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇతర పార్టీలకు అమ్ముడుపోయారని విమర్శిస్తున్నారు మరో ఎంపీ మార్గాని భరత్ రామ్. అలాంటి వారిని తమ పార్టీ ఉపేక్షించదని చెప్పారు. రఘురామపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పారాయన. రెండేళ్లుగా తాము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఆయనపై అనర్హత వేటు వేసేందుకు విన్నపాలు ఇస్తున్నట్టు తెలిపారు. నేరుగా ఆయన పార్టీ అధినేతను దూషిస్తున్నారని, అయితే తాను కేవలం ప్రభుత్వాన్ని అంటున్నానని రఘురామ అతి తెలివి చూపిస్తున్నారని మండిపడ్డారు భరత్ రామ్.

ఇప్పటికే అనర్హత వేటు వేయాలని చాలాసార్లు లోక్ సభ స్పీకర్ కు నివేదించామని చెప్పారు మార్గాని భరత్ రామ్. ఇప్పటికే ఈ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ వద్ద ఉందని, స్పీకర్ తమ నివేదనతో ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారని చెప్పారు భరత్ రామ్. ప్రధాని మోదీపై చట్టసభ సభ్యులెవరైనా ఇలాగే విమర్శలు చేస్తే బీజేపీ నేతలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు మార్గాని భరత్ రామ్.

మరోవైపు రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటిషన్‌ పై మౌఖిక సాక్ష్యం ఇచ్చారు ఎంపీ భరత్ రామ్. సోమవారం ఆయన లోక్‌ సభ ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరై తన సాక్ష్యం చెప్పారు. ప్రివిలేజ్ కమిటీ  చైర్మన్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ కి ఆయన తన వాదన వినిపించారు. రఘురామపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ అభ్యర్థనతో వెంటనే రఘురామపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: