సీఎం జగన్ రాష్ట్రంలో లేరు. ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ సమయంలో ఏదో ఒక శాంతి భద్రత సమస్య సృష్టించాలనేది ప్రతిపక్షాల వ్యూహంగా చెబుతున్నారు అధికార పార్టీ నేతలు. బస్సు యాత్రపై రాళ్లు పడతాయేమో చూసుకోండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను అందుకు సాక్ష్యంగా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా అమలాపురంలో బస్సునే తగలబెట్టారు, మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పుపెట్టారు. జగన్ లేని టైమ్ చూసుకుని రాష్ట్రంలో ఇలాంటి విపరీత పరిణామాలు జరుగుతున్నాయని.. వీటి వెనక ఎవరున్నారనేది బహిరంగ రహస్యం అని అంటున్నారు వైసీపీ నేతలు.

ప్రతిపక్షాల పనేనా..?
హోం మంత్రి తానేటి వనిత సహా ఇతర నేతలంతా ఇది ప్రతిపక్షాల కుట్రేనని చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల వల్లే ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా పేరు మార్పుని గతంలో స్వాగతించిన పార్టీల నాయకులే ఇప్పుడిలా మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లోపల ఒక మాట, బయట ఒక మాట మాట్లాడొద్దని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజల ముందుకు రావాలని, సంయమనం పాటించాలని చెప్పాలని కోరారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.

అధికార పార్టీపైనా విమర్శలు..
మరోవైపు అధికార పార్టీపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలోనే ఈ పేరు మార్పు నిర్ణయం తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదంటున్నారు. అప్పుడు సైలెంట్ గా ఉండి, ఇప్పుడు సడన్ గా పేరు మార్చడం అందులోనూ పేరు మార్పు కోసం నెలరోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వడం కూడా ఉద్రిక్తతలకు కారణం అయిందని చెబుతున్నారు. అధికార పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఏం జరుగుతోంది..?
అమలాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు మెల్ల మెల్లగా కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయి. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల స్థాపనకు కృషి చేయాలని పోలీసులకు ఆయన సూచించినట్టు తెలుస్తోంది. జగన్ రాష్ట్రంలో లేకపోవడంతో మిగతా నాయకులు కూడా ఈ విషయంలో హడావిడి పడుతున్నారు. అధినేత లేని సమయంలో ప్రభుత్వానికి అప్రతిష్ట కలిగేలా ఇలాంటి చర్యలు జరగడంతో వారు ఆందోళనలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: