కోనసీమలో జరిగిన అల్లర్లలో రాజకీయపార్టీల పాత్రఎంత ? కులాల పాత్రఎంత ? లేకపోతే రాజకీయం+కులాలు కలిసే మంటలు మండించాయా అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాజకీయపార్టీలకు ప్రత్యక్షంగా ఎలాంటి పాత్ర లేనప్పటికీ పరోక్షంగా పార్టీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకనే పార్టీలు వెనకుండి ముందుకు కులాలను పెట్టి మంటలు మండించాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.





ఇక్కడ గమనించాల్సిందేమంటే కోనసీమలో ఎస్సీలు, బీసీలు ప్రధానంగా శెట్టిబలిజలు, కాపుల జనాభా దాదాపు సమానంగానే ఉంటాయి. ఇక్కడ ఒక విచిత్రమైన కాంబినేషన్ ఉంది. అదేమిటంటే బీసీ-కాపులకు పడదు. బీసీలకు-ఎస్సీలకు పడదు. అలాగే ఎస్సీలు-కాపులకు కూడా పడదు. అంటే ఇటు బీసీలకు అటు కాపులకు ఎస్సీలు కామన్ ప్రత్యర్ధులు. పై కాంబినేషన్లో ఏకకాలంలో ఎస్సీలతో బీసీలు, కాపులకు పడకపోతే ఎస్సీలకు వ్యతిరేకంగా బీసీలు, కాపులు ఏకమైపోతారట.





ఇపుడు జరిగిందిదే అని దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు భాగ్యారావు చెప్పారు. భాగ్యారావు ప్రకారం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెట్టడాన్ని బీసీలు, కాపులు సహించలేకపోయారట. రాజకీయపార్టీలుగా జిల్లాకు అంబేద్కర్ పేరుపెట్టాలని పైకి డిమాండ్లు చేశాయి.  ఎందుకు డిమాండ్లు చేశాయంటే ఎలాగూ ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెడుతుందన్న నమ్మకంలేదు కాబట్టే. డిమాండ్లయితే చేశాయికానీ లోలోపల మాత్రం ఏపార్టీకి అంబేద్కర్ పేరుపెట్టడం ఇష్టంలేదని భాగ్యారావు అంటున్నారు. అయితే ఎవరూ ఊహించనిరీతిలో కోనసీమ జిల్లాపేరును ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చేసింది. దీంతో రాజకీయపార్టీలు, బీసీ, కాపు నేతలకు పెద్ద షాక్ తగిలినట్లయ్యిందట.






ప్రభుత్వం ఎప్పుడైతే తమ డిమాండ్ల మేరకు జిల్లాపేరును అంబేద్కర్ పేరుగా మార్చింది దాన్ని ఎస్సీలు తమ విజయంగా చెప్పుకోవటం మొదలుపెట్టారట. దాంతో బీసీలు, కాపులకు మంట మొదలైంది. ఆ మంటే ఇపుడు కోనసీమలో మంటలు మండటానికి కారణమైందని భాగ్యారావు చెప్పారు. అంటే ఈయన చెప్పిన ప్రకారం పార్టీలు వెనకుండి కులాలను ముందుకు ఎగదోసి మంటలు మండటానికి కారణమయ్యాయి. దీనికి ఉదాహరణ ఏమిటంటే అంబేద్కర్ పేరు పెట్టడంలో ప్రభుత్వం సరైన విదానాన్ని ఆచరించలేదని పార్టీలన్నీ యూటర్న్ తీసుకోవటమే.



మరింత సమాచారం తెలుసుకోండి: