తెలుగురాష్ట్రాల నుండి వచ్చే ఎన్నికల్లో  పోటీచేయాలని ఉంది..స్వతహాగా తాను తెలుగు మహిళనే..పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పార్టీ విజయానికి కృషిచేస్తాను..తెలంగాణా, ఏపీల్లో అధికారపార్టీలు పాలనను గాలికి వదిలేశాయి..ఇవి తాజాగా ఒకప్పటి హీరోయిన్, రాజకీయ నాయకురాలు చేసిన తాజా కామెంట్లు. తన వ్యాఖ్యలను చూస్తుంటేనే తెలుగురాష్ట్రాలంటే ఆమెకు ఎంత చులకనో అర్ధమైపోతోంది.






చులకన అని ఎందుకు అనాల్సొచ్చిందంటే ఆమె తెలుగురాష్ట్రాలను వదిలేసి సుమారు పాతికేళ్ళవుతోంది. అప్పుడెప్పుడో హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించిన జయప్రదకు ఎన్టీయార్ తో సన్నిహితం కారణంగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అప్పట్లోనే రాజ్యసభ ఎంపీగా కూడా నామినేట్ అయ్యారు. ఎన్టీయార్ కు చంద్రబాబునాయుడు వెన్నుపోటుపొడిచిన ఎపిసోడ్ లో ఈమె పాత్రకూడా ఉంది. తర్వాత పరిణామాల్లో చంద్రబాబుతో పడనికారణంగా రాజకీయాలకు దూరమైపోయారు.





అయితే అప్పటికే బాలీవుడ్ సినిమాల్లో కూడా బాగా ఫేమస్ కావటంతో ఉత్తరాధి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎస్సీలో ఒకపుడు కీలకంగా వ్యవహరించిన అమర్ సింగ్ ప్రాపకంతో పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుండి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. చాలా సంవత్సరాలు యూపీ రాజకీయాల్లోనే ఉండి తర్వాత కనుమరుగైపోయారు. మళ్ళీ ఇంతకాలానికి బీజేపీ నేత అవతారంలో హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. పాతికేళ్ళక్రితం తెలుగురాష్ట్రాల రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోయిన జయప్రదకు తాను తెలుగు మహిళనే విషయం ఇపుడు గుర్తుకొచ్చింది.






ఎక్కడో ఒకచోట నుండి పోటీచేయాలని బలంగా ఉందట. అలాగే అధిష్టానం ఆదేశిస్తే బీజేపీ గెలుపుకు కృషిచేస్తారట. అంటే తాను నాలుగురోజులు వరుసగా తిరిగేస్తే మళ్ళీ జనాలు తనను గుర్తుపట్టేసి నెత్తిన పెట్టుకుంటారని బాగా నమ్మకంగా ఉన్నట్లుంది. ఇప్పటితరం వాళ్ళలో ఎంతమంది ఈమెను గుర్తుపడతారు ? ఎంతమంది ఈమె చెబితే బీజేపీకి ఓట్లేస్తారో చూడాలి. ఏపీలో కమలంపార్టీకి దిక్కూ దివాణం లేకుండా పడుంది. కాబట్టి తనపై తనకు అంత నమ్మకముంటే ఏపీలో బీజేపీ గెలుపుకు కృషిచేస్తే బాగుంటుంది. పనిలోపనిగా పోటీ కూడా చేస్తే ఓ పనైపోతుంది..ఏమంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: