ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై విమర్శల్లో భాగంగా పలు ఫేక్ పోస్ట్ లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. విచిత్రం ఏంటంటే.. అదేదో జీవో కాపీలాగా, ప్రభుత్వ ప్రకటన లాగా.. ప్రభుత్వ రాజముద్ర, భారత జాతీయ చిహ్నం కూడా వేసి మరీ ఫేక్ పోస్ట్ లు పెడుతున్నారు కొందరు. ప్రభుత్వంపై విమర్శలు రావాలని, ప్రజల్లో ఆగ్రహం రావాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ ప్రచారమే వారి కొంప ముంచింది. తప్పుడు ప్రచారం చేస్తున్న ఐదుగురిని సీఐడీ పోలీసులు గుర్తించి నోటీసులు జారీ చేశారు.

ఏపీలో అమలులో ఉన్న జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాలకు సంబంధించి ఫేక్ పోస్ట్ లు ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఆయా పథకాలను ఈ ఏడాది వరకు నిలిపివేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు కొందరు. ఈ దుష్ప్రచారం చేస్తున్న వారిని గుర్తించిన సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఫేక్‌ పోస్టులు సృష్టించి, వాటిని విస్తృతంగా ప్రచారం చేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నవారిలో ఐదుగురిని గుర్తించి వారికి నోటీసులు జారీ చేశారు సీఐడీ పోలీసులు. ఇటీవల వారిలో ముగ్గురిని విచారణకు పిలిపించారు. భారత జాతీయ చిహ్నంతోపాటు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని కూడా ముద్రించి ప్రభుత్వమే అధికారిక ప్రకటన విడుదల చేసినట్టుగా ఫేక్ పోస్ట్ లు సృష్టించడంతో సీఐడీ పోలీసులకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ చేపట్టి.. కేసులు నమోదు చేశారు.

ఇలాంటి ఫేక్ పోస్ట్ ల వల్ల లబ్ధిదారులు గందరగోళంపో పడతారని, వారంతా ఆందోళకు గురవుతారని చెబుతున్నారు అధికారులు. ఫేక్ పోస్ట్ ల సృష్టికర్తల వ్యూహం కూడా అదేనని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికే ఇలా చేశారని నిర్థారించారు. ఆ ఫేక్‌ పోస్టులను వైరల్ చేసేందుకు సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫేక్ అకౌంట్లు సృష్టించారు. ఇలా వైరల్‌ చేసిన 12 సోషల్‌ మీడియా అకౌంట్లను కూడా పోలీసులు గుర్తించారు. ఫేక్ పోస్ట్ ల సృష్టికర్తలుగా గుర్తించిన ఐదుగురికి సీఐడీ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణ కూడా చేపట్టారు. మొత్తం ముగ్గురిని విచారణకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న మరికొందరిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: