వాట్సప్ గ్రూప్ లో అభ్యంతరకరమైన పోస్టింగ్ పెడితే దానికి ఎవరు బాధ్యులు. ఆ మెసేజ్ పెట్టినవారిపై ముందు చర్య తీసుకుంటారు, ఆ తర్వాత అడ్మిన్ల సంగతి చూస్తారు. అయితే ఇటీవల అడ్మిన్లకు మినహాయింపు ఉంటుందని కోర్టు తీర్పు వెలువడింది. కానీ అడ్మిన్లు పూర్తిగా తప్పించుకోలేరని చెబుతున్నారు పోలీసులు. వాట్సప్ లలో అభ్యంతరకరమైన పోస్టింగ్ లు పెడితే, అల్లర్లకు కారణం అయితే, విధ్వంసాలకు మూలం అయితే.. కచ్చితంగా ఆ గ్రూప్ అడ్మిన్లు కూడా బాధ్యులు అవుతారని చెబుతున్నారు పోలీసులు.

కోనసీమ జిల్లా అల్లర్ల విచారణలో పోలీసులకు వాట్సప్ మెసేజ్ లు, సోషల్ మీడియా పోస్టింగ్ లు ప్రధాన ఆధారాలుగా మారాయి. సోషల్ మీడియా పోస్టింగ్ ల వల్లే క్షణాల్లో ఆందోళనకారులు అంతా ఒకచోట చేరి రచ్చ చేశారని చెబుతున్నారు పోలీసులు. విధ్వంసానికి కారణం అయ్యారని అంటున్నారు. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు
అమలాపురం అల్లర్లకు సంబంధించి మొత్తం 71మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. మంగళవారం 9మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడంతో మొత్తం అరెస్ట్ లు 71కి చేరుకున్నాయి. ఈ అల్లర్లకి సంబంధించి పోలీసులు మొత్తం ఏడు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశారు. ఇప్పటి వరకు నాలుగు ఎఫ్ఐఆర్ లకు సంబంధించి 71మందిని అరెస్ట్ చేశారు. అమలాపురంలో ఇంకా 144 సెక్షన్ కొనసాగిస్తూనే ఉన్నారు.

సోషల్‌ మీడియాపై నిఘా..
ప్రస్తుతం అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు అల్లర్లపై మెసేజ్ లు పంపించుకుంటున్నారని గుర్తించిన పోలీసులు నెట్ సేవలను ఆపివేశారు. సున్నితమైన విషయాలపై కామెంట్ చేసినా, ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌ లు పెట్టినా.. ఒక వర్గాన్ని కించపరుస్తూ, నేతల్ని కించ పరుస్తూ పోస్టింగ్ లు పెట్టినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోనసీమ జిల్లా ఎస్పీ. అలాంటి పోస్టులు పెట్టేవారిపైనే కాకుండా ఆ గ్రూప్ లు మెయింటెన్ చేస్తున్న వారు, గ్రూప్ అడ్మిన్లు కూడా దానికి బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు. ఎవరైనా అలాంటి పోస్టిం గు పెట్టి, అల్లర్లకు కారణం అయ్యారని గమనిస్తే.. వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: