వాట్సప్ లో దొంగ ఖాతాల పని పట్టేందుకు సంస్థ నడుం బిగించింది. ఇటీవల కొంత కాలంగా ఈ ఫేక్ ఖాతాలతో పెద్ద సమస్యలు వచ్చిపడుతున్నాయి. అంతే కాదు, ఇలాంటి ఖాతాలను అడ్డు పెట్టుకుని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. కేవలం ఫేక్ ఖాతాలే కాదు, ఒరిజినల్ నెంబర్లు, ఒరిజినల్ వాట్సప్ ఐడీలు ఉన్నా కూడా కేవలం మోసాలకోసమే వాటిని ఉపయోగించేవారు కూడా ఉన్నారు. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కూడా కొంతమంది వాటిని వాడుతున్నారు. ఇలాంటి వాటిపై వాట్సప్ యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటి వరకు భారత్ లో 16.6 లక్షల వాట్సప్ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది ఆ సంస్థ.

కొత్త ఐటీ రూల్స్‌ ప్రకారం ఏప్రిల్‌ నెలలో భారత్ లో మొత్తం 16.6లక్షల వాట్సప్ అకౌంట్లను బ్లాక్ లో పెట్టినట్టు తెలిపింది ఆ సంస్థ. కొంత కాలంగా భారత్ లో ఐటీ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వాట్సప్ యూజర్లపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన లిస్ట్ ప్రకటించింది. అయితే ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచిన సంస్థ మొత్తం 16.6 లక్షల ఖాతాలు ఏరిపారేసినట్టు తెలిపింది. గ్రీవెన్స్ సెల్ కి వచ్చిన ఫిర్యాదులను కూడా వాట్సప్ పట్టి చూస్తోంది. ఏప్రిల్‌లో 844 ఫిర్యాదులు గ్రీవెన్స్‌ సెల్‌ కు అందాయి. అంతకు ముందు మార్చిలో 597 ఫిర్యాదులందాయని సంస్థ తెలిపింది.

వినియోగదారుల భద్రతా నివేదికలో వీటి వివరాలన్నీ పొందుపరుస్తున్నట్టు తెలిపింది వాట్సప్ యాజమాన్యం. యూజర్ల ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల ఆధారంగా తీసుకున్న చర్యలను పొందుపరుస్తామని చెప్పింది. తమ నివేదిక ఆధారంగా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని గుర్తిస్తామని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారత్ లో కొత్త ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియాలో 50లక్షలమందికిపైగా యూజర్లను కలిగి ఉన్న ఫ్లాట్ ఫామ్ లు నెలవారీ నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వాట్సప్ కూడా నెలవారీ నివేదికలను ఇస్తోంది. ఏప్రిల్ నెలలోల 16.6 లక్షల అకౌంట్లను బ్లాక్ చేసినట్టు ప్రభుత్వానికి ఆ సంస్థ నివేదికను అందించింది. ఇతర సోషల్ మీడియా సంస్థలనుంచి కూడా ఇలాగే నివేదికను కోరింది ప్రభుత్వం. అయితే వాట్సప్ లోనే ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: