నరేంద్రమోడీ దగ్గర తనకున్న పరపతినంతా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించాల్సిందే. కాళ్ళు పట్టుకుంటారో,  ఒత్తిడి పెట్టి నెత్తిన కూర్చుంటారో అది జగన్ సమస్య. రాష్ట్రానికి కావాల్సింది నిధులు, పనులు జరిగి ప్రాజెక్టు పూర్తవ్వటమే. ఇదంతా దేనికోసమని అనుకుంటున్నారా ? అవును ఇదంతా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వటానికి జగన్ చేయాల్సిందిదే. ఎందుకంటే రాష్ట్రప్రభుత్వం చేతిలో ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవ్వదనే విషయం అర్ధమైపోయింది.





విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టును అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడి సర్కార్ పోలవరాన్ని పూర్తి చేయాల్సుంది. అయితే చంద్రబాబునాయుడు ప్రాజెక్టును బలవంతంగా కేంద్రం చేతిలో నుండి లాక్కున్నారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఎందుకు బలవంతంగా లాక్కున్నారో, కేంద్రం ఎందుకు ఇచ్చేసిందో వాళ్ళిద్దరికే తెలియాలి. మొత్తానికి చంద్రబాబు ఐదేళ్ళల్లో ప్రాజెక్టు పూర్తికాకపోగా కంపుగా తయారైంది.





కాఫర్ డ్యాం కట్టకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం వల్ల ప్రాజెక్టు దెబ్బతినేసింది. దీంతో ఇపుడు డయాఫ్రంవాల్ నిర్మాణం చేయాల్సొచ్చింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణంలో బాగా ఆలస్యమవ్వటం ఖాయం. ఇదే విషయాన్ని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన రు. 56వేల కోట్లను కేంద్రం ఇవ్వదు. అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసేంత సామర్ధ్యం రాష్ట్రానికి లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం అనుమానమైపోయింది.





కాబట్టి ఇక్కడే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను జగన్ కేంద్రానికి అప్పగించేయాలి. ఎటువంటి మొహమాటానికి పోకుండా, సిగ్గుపడకుండా ప్రాజెక్టును కేంద్రం చేతిలో పెడితేనే ఎప్పటికైనా పూర్తయ్యే అవకాశముంది. ఒకవేళ కేంద్రం కూడా ప్రాజెక్టును పూర్తిచేయలేకపోతే అది కేంద్రం తప్పవుతుంది. అసలు ప్రాజెక్టును తన చేతిలోకి తీసుకోవటమే చంద్రబాబు చేసిన తప్పు. ఆ తప్పును కంటిన్యు చేయటమే జగన్ రెండో తప్పు. ఇప్పటికైనా మించిపోయింది లేదుకాబట్టి ఇప్పటికైనా జగన్ మేల్కొని వెంటనే మోడితో మాట్లాడుకుని ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను జగన్ కేంద్రానికి అప్పగించేయటమే ఉత్తమం.




మరింత సమాచారం తెలుసుకోండి: