వచ్చే ఎన్నికలకు సంబంధించి కేసీయార్ వ్యూహం మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు గజ్వేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీయార్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నారట. గతంలో ఒకసారి ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్ సభ సీటునుండే పోటీచేయటానికి రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సీఎం ఖాళీచేయబోయే అసెంబ్లీ సీటునుండి వంటేరు ప్రతాపరెడ్డి పోటీకి రెడీ అవుతున్నారట.






వంటేరు గతంలో టీడీపీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కేసీయార్ మీద వంటేరే పోటీచేసి ఓడిపోయారు. తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరి 2018లో రెండోసారి కేసీయార్ మీదే పోటీచేసి ఓడిపోయారు. రెండుసార్లు ఓడిపోయినా మంచి ఓట్లే తెచ్చుకున్నారు. స్వయంగా కేసీయార్ మీద పోటీచేసి ఓడిపోయినా మంచిఓట్లు తెచ్చుకోవటంతో గట్టినేతగా పేరు తెచ్చుకున్నారు. దాంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వంటేరును కేసీయార్ పార్టీలోకి లాగేసుకున్నారు.






గడచిన నాలుగేళ్ళుగా కేసీయార్ తరపున వంటేరే నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ కార్యక్రమాలను కూడా వంటేరే చూసుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న సమయంలోనే వంటేరు సన్నిహితులతో మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో గజ్వేలులో పోటీచేయబోయేది తానే అని చెప్పారట. దాంతో కేసీయార్ ఆలోచన బయటకు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో కేసీయార్ గజ్వేలులో పోటీచేసే ఉద్దేశ్యమే ఉంటే ఇంకెవరికీ అవకాశం రాదు. కేసీయార్ ఉన్నంతవరకు ఇక్కడినుండి పోటీచేయాలన్న ఆలోచన కూడా రాదు.






జాతీయ రాజకీయాల్లో పూర్తిటైమ్ కేటాయించాలని ఆలోచిస్తున్న కేసీయార్ ఢిల్లీలో ఉండటమే సరైన పద్దతిగా భావిస్తున్నారట. జాతీయస్ధాయి నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలంటే ఢిల్లీలో ఉంటేనే సాధ్యమవుతుంది. వచ్చే ఎన్నికలనాటికి జాతీయ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు సంభవించబోతున్నాయని అనుకుంటున్న కేసీయార్ తన బేస్ ను ఢిల్లీకి మార్చాలని అనుకోవటంలో ఆశ్చర్యమేమీలేదు. అందుకనే వంటేరుకు గజ్వేలులో పోటీచేయబోయే అవకాశం రాబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఏదేమైనా తొందరలోనే సంచలనమైన వార్త వింటారని కేసీయార్ చెప్పింది  బహుశా ఇదేనేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: