దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు ఏపీలో కూడా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో ముఖ్యంగా విశాఖ పట్నం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల కొద్దిరోజులుగా ఐదు లేదా ఆరు కేసులు నమోదు కాగా.. బుధవారం ఒక్కసారిగా ఆ కేసుల సంఖ్య 13కి చేరుకుంది. అయితే బాధితులంతా ఆస్పత్రులకు పరుగులు తీయడంలేదు. ఎక్కువమంది హోం ఐసోలేషన్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హోం ఐసోలేషన్‌ లో 41 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. వీరందరికీ ప్రభుత్వం టెలి మెడిసిన్‌ ద్వారా చికిత్స అందిస్తోంది. టెలిమెడిసిన్‌ ద్వారా రోగులకు చికిత్స అందించే వైద్యులు ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఆక్సిజన్‌ లెవెల్స్‌ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారికి ధైర్యం చెబుతున్నారు.

కేజీహెచ్ లో కరోనా వార్డ్..
కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్తగా కేజీహెచ్ లో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. 350 బెడ్స్ సిద్ధం చేశారు. కొవిడ్ బారిన పడిన గర్భిణులు, పిల్లలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకోసం ఈ బెడ్స్ సిద్ధంగా ఉచారు. అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. ఇతర మందులు కూడా అందుబాటులో ఉంచారు. అయితే ప్రస్తుతం కేజీహెచ్ లో కరోనా బాధితులెవరూ చికిత్స తీసుకోవడంలేదు. దాదాపుగా అందరూ హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు.

ఈ సారి కరోనా మరీ స్వల్ప లక్షణాలతో వస్తున్నట్టు తెలుస్తోంది. స్వల్పంగా జ్వరం, దగ్గు, తుమ్ములు ఉన్నవారెవరైనా పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. ప్రస్తుతం జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్లునొప్పులు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ గా తేలుతుందని భయపడుతున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప్రాణాపాయం ఉండదని, ప్రజలు భయపడొద్దని చెబుతున్నారు వైద్యులు. అధికారులు కూడా.. మాస్క్ నిబంధన కఠినతరం చేస్తామంటున్నారు. ప్రజలంతా మాస్క్ లు ధరించాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: