ఇన్నాళ్లూ వైసీపీలో గుట్టుగా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. ఆమధ్య నెల్లూరు జిల్లా పంచాయితీ జరిగింది, ఇటీవల గన్నవరం గొడవకి కూడా తాడేపల్లి పరిష్కారం చూపించే దిశగా చర్చలు జరిపింది. ఆ తర్వాత విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వ్యవహారం కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి చేరింది. ఇప్పుడు వీటన్నిటికంటే పెద్ద గొడవ మచిలీపట్నంలో జరిగింది. స్థానిక ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య వర్గ విభేదాలు రచ్చకెక్కాయి.

మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. మచిలీపట్నంలో శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలంటూ కొందరు ఎంపీని కోరగా.. ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఎంపీ బాలశౌరి వెళ్లారు. అయితే పేర్ని నాని అనుచరులు ‘గోబ్యాక్‌ ఎంపీ’ అంటూ అడ్డుపడ్డారు. దీనిపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. ‘బందరు నీ అడ్డానా..!’ అంటూ పేర్ని నానిని ప్రశ్నించారు బాలశౌరి.

వాస్తవానికి 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఎంపీ బాలశౌరి, అప్పట్లో మంత్రిగా ఉన్న పేర్ని నాని కలసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. అయితే పేర్ని నాని తన నియోజకవర్గానికి బీజేపీ ఎంపీలను పిలిచేవారిని, తనని మాత్రం పక్కనపెట్టారని బాలశౌరి అంటున్నారు. ఇప్పుడు మంత్రికి పదవి లేకపోవడంతో బాలశౌరి దాడి మరింత పెంచారు. బందరు నీ అడ్డానా అంటూ ప్రస్నిస్తున్నారు. అక్కడితో ఆగలేదు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో, పేర్ని నాని టచ్ లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు బాలశౌరి. వారానికోసారి నారాయణను, పేర్ని నాని కలుస్తున్నారని చెప్పారు. తానికనుంచి బందరులోనే ఉంటానని, అసలు సంగతేంటే తేల్చుకుంటానని సవాల్ విసిరారు.

బాలశౌరి, పేర్ని నాని మధ్య విభేదాలపై అధిష్టానం దృష్టిసారించింది. ఇద్దరినీ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని సూచించారట. త్వరలో వీరిద్దరూ తాడేపల్లికి రావాల్సిన అవసరం ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవైపు సీఎం జగన్ 175 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు, మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇలా విభేదాలతో రచ్చకెక్కుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: