జగన్ ఆ ఒక్క పని చేస్తే చాలు ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ప్రత్యేక హోదా విషయంలో ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదని చెబుతున్నారు. కేంద్రం మెడలు వంచాల్సిన పనిలేదని, కేంద్రం తనకు తానే దిగి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ హర్షకుమార్ చేసిన ప్రతిపాదన ఏంటి..? దానికి జగన్ ఒప్పుకుంటారా..? అనేది తేలాల్సి ఉంది.

ప్రత్యేక హోదా, పోలవరం, వైజాగ్ స్టీల్, విభజన హామీల సాధనకోసం ఏపీ జగన్ ఆ ఒక్కపని చేయాలన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. సీఎం జగన్‌ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ఆయన రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఎన్నికల్లో జగన్ ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడేం చేస్తున్నారని హర్షకుమార్ ప్రశ్నించారు. కేవలం ప్రత్యేక హోదా విషయంలోనే కాదు, పోలవరం నిధుల సాధనకు కూడా ఇదే చక్కని అవకాశమన్నారు హర్షకుమార్. రాష్ట్రపతి ఎన్నికలను మంచి అవకాశంగా వాడుకోవాలని ఆయన చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ 13 వేల ఎలక్ట్రోరల్ ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆ ఓట్లకోసం ఎన్డీఏ తమకు అనుకూలంగా ఉన్న పార్టీల వెంట పడుతోంది. వైసీపీ దగ్గర ఉన్న 43 వేల ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి. అవి లభిస్తే కచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారు. వైసీపీ మద్దతివ్వకపోతే రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏ భయపడటం ఖాయం. ప్రతిపక్ష కూటమి అభ్యర్థికి మద్దతిస్తామంటూ జగన్ ప్రకటిస్తే మాత్రం కచ్చితంగా కేంద్రం దిగి వస్తుందని, ఆయన కోరిన కోర్కె నెరవేరుస్తుందని, జగన్ కి నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉంటే, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే.. ఈ సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తేవాలని, కేంద్రాన్ని ఇరుకున పెట్టి హోదా సాధించుకోవాలని చెప్పారు హర్షకుమార్. ఒకవేళ అలా చేయకపోతే.. తనపై కేసులు ఉన్నాయి కాబట్టే.. జగన్ కేంద్రానికి సరెండర్ అయ్యారని అనుకోవాల్సి వస్తుందని చెప్పారు హర్షకుమార్. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటేసే ధైర్యం సీఎం జగన్ కి లేకపోతే.. కనీసం ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండాలని, అలా చేస్తే ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోతారన్నారు. ఇలా బెదిరించకపోతే ఎప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా రాదన్నారు హర్షకుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: