ఇటీవల కాలంలో సీఎం జగన్ కు నియోజకవర్గాల పంచాయితీ ఎక్కువవుతోంది. విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గొడవ సద్దుమణిగింది అనుకునేలోగా.. గన్నవరం గొడవ సీఎంకు చికాకు తెప్పిస్తోంది. గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు ఇప్పటికే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి సీఎం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా హిందూపురం గొడవ ఆయన ముందుకొచ్చింది. అయితే ఆయన దాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన సమక్షంలో ఈ గొడవ తేల్చుకోవాలని, నియోజకవర్గంలో పార్టీని పటిష్టపరచాలని సూచించారు.

హిందూపురంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఉన్నారు. ఈ దఫా హిందూపురాన్ని చేజిక్కించుకోవాలనుకుంటోంది వైసీపీ. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే అక్కడ పార్టీలోనే అసమ్మతి ఉంది. హిందూపురం అధికార వైసీపీలో నెలకొన్న అసమ్మతి పంచాయితీ ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరింది. సీఎం జగన్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా.. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతోపాటుట పలువురు హిందూపురం నాయకులు పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎంకు స్వాగతం పలికారు. ఇక హిందూపురం మాజీ సమన్వయకర్త, ప్రస్తుతం అసమ్మతి వర్గంలోని కీలక నాయకుడుగా ఉన్న వేణుగోపాల్‌ రెడ్డిని సీఎం పిలిపించుకుని మాట్లాడారు. ఆయన సీఎంని కలిసిన తర్వాత నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీశారు జగన్.

ప్రస్తుత నియోజకవర్గ ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అందరినీ కలుపుకొని వెళుతున్నారా లేదా అని సీఎం జగన్ వేణుగోపాల్ రెడ్డి వర్గాన్ని ప్రశ్నించారు. అయితే వేణు వెంటనే ఇక్బాల్ పై ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆయన పక్కనపెట్టారని చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జగన్ కు వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే పక్కనే ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్.. వేణుగోపాల్ రెడ్డి వాదనతో ఏకీభవించలేదు. తాను అందర్నీ కలుపుకొని వెళ్తున్నానని, అయితే వేణుగోపాల్ రెడ్డి స్థానికులు, స్థానికేతరులు అనే విభజన తెచ్చారని, తనకి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని చెప్పారు. దీంతో సీఎం జగన్.. అందరినీ కలుపుకొని వెళ్లాలని, పార్టీ గెలుపుకి కృషి చేయాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ కి సూచించారు. అదే సమయంలో హిందూపురం పంచాయితీని తీర్చాలంటూ మంత్రి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: