దాదాపు పదేళ్ల క్రితమే భారత్ నుంచి పోలియో వైరస్ ని తరిమేశామని చెబుతోంది ప్రభుత్వం. 2014 మార్చి 27న భారత్ ని పోలియో రహిత దేశంగా అంతర్జాతీయ సమాజం కూడా గుర్తించింది. అప్పటినుంచి ఇప్పటి వరకు భారత్ లో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు పోలియో జాడ మాత్రం దొరికింది. పోలియో వైరస్ జాడ కనపడింది.

భారత్ లో పోలియో పట్ల అవగాహన కల్పించడంతో పాటు, తప్పనిసరిగా చిన్న పిల్లలకు చుక్కల మందు వేయిస్తున్నారు. దీంతో ఇకపై భారత్ లో పోలియో సోకే వారు ఎవరూ ఉండకపోవచ్చు అనే దశకు చేరుకున్నాం. పోలియో కేసుల సంఖ్య కూడా ఇప్పుడు జీరో. దీంతో ఇండియాని పోలియో ఫ్రీ కంట్రీగా ప్రకటించారు. 2011లో పశ్చిమబెంగాల్ లోని 12 ఏళ్ల బాలికకు చివరిసారిగా పోలియో సోకినట్టు భారత్ లో రికార్డులు ఉన్నాయి. ఆ తర్వాత 2014 మార్చి 27న భారత్ ని పోలియో రహిత దేశంగా గుర్తించారు. ఆమేరకు ప్రకటించారు కూడా.

దాదాపుగా పదేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇండియాలో పోలియో వైరస్ వెలుగులోకి రావడం విశేషం. ఇప్పుడు కూడా వెస్ట్ బెంగాల్ లోనే పోలియో వైరస్ జాడ కనపడింది. కోల్‌ కతాలో మెటియాబురుజ్ ప్రాంతంలోని ఓ మురుగు కాల్వలోని నీటిలో పోలియో వైరస్ ని వైద్య సిబ్బంది గుర్తించారు. ఆ మురుగునీటి శాంపిల్స్ ని పరీక్షించి అందులో వైరస్ ఉన్నట్టు తేల్చారు. యునిసెఫ్, భారత ఆరోగ్య శాఖ కలసి చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడేం చేయాలి..?
పోలియో వైరస్ జాడ కనపడటంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. వైరస్ ఆనవాళ్లు దొరికిన తర్వాత మెటియాబురుజ్ ప్రాంతంలో బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిషేధించారు. గతంలో కూడా ఇలాంటి నిబంధనలున్నా కూడా ఇప్పుడు వాటిని కఠినతరం చేశారు. ఈమేరకు పశ్చిమబెంగాల్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలపై వైద్య సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులు ఆదేశించారు. అలాంటి వారందరికీ మరోసారి పోలియో టీకా వేయాలని సూచించారు. ఇటీవల కరోనా కారణంగా పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రం కూడా నిదానంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో పోలియో మరోసారి కనపడితే అంతర్జాతీయ సమాజంలో భారత్ తలెత్తుకోలేదు. అందుకే అధికారులు వ్యాక్సినేషన్ ని ప్రారంభించాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: