ఇపుడిదే విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు, మామూలు జనాలకు అర్ధం కావటంలేదు. జనసేన పెట్టి సుమారు పదేళ్ళవుతున్నా మెగా కాంపౌండ్ నుండి నాగుబాబు తప్ప ఇంకెవరు పవన్ కు మద్దతుగా రోడ్డుపైకి రాలేదు. మొన్నటి ఎన్నికల్లో ఎవరు కనీసం ప్రచారం చేయటానికి కూడా రాలేదు.  చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు నాగుబాబు, పవన్, రామ్ చరణ్ తేజ లాంటి మరికొందరు ప్రచారంలో బాగా తిరిగారు.






ప్రజారాజ్యంపార్టీలోని యువరాజ్యం విభాగానికి పవనే అధ్యక్షుడిగా పనిచేశారు. మరప్పట్లో అన్నపార్టీకి తమ్ముడు అంతగా కష్టపడినప్పుడు ఇపుడు తమ్ముడు పార్టీకి అన్న మద్దతు ఎక్కడా కనబడటంలేదు. ఎప్పుడైతే చిరంజీవి దూరంగా ఉన్నారో నాగుబాబు తప్ప కాంపౌండ్ నుండి ఇంకో హీరో ఎవరు పార్టీ గురించి ఎక్కడా కనీసం మాట్లాడటం కూడా లేదు. ఉండటానికి చాలామందే హీరోలున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా పవన్ కు మద్దతుగా నిలబడలేదు.






ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మెగా హీరోలు వరుణ్ తేజ్ రు. 10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రు. 10 లక్షలు, వైష్ణవ్ తేజ్ రు. 5 లక్షలు, నిహారిక రు. 5 లక్షలు విరాళం అందించినట్లు స్వయంగా పవనే ప్రకటించారు. అలాగే అక్క, బావ, వాళ్ళ పిల్లలు కూడా ఆర్ధికసాయం చేసినట్లు చెప్పారు. కౌలురైతుల కుటుంబాలకు ఆర్ధికసాయం పేరుతో జనసేన పార్టీకి విరాళం ఇవ్వటం కూడా బహుశా ఇదే మొదటిసారేమో.






ఇదంతా చూస్తుంటే రాజకీయంగా పవన్ తో మెగా కాంపౌండ్ బాగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్నట్లే ఉంది. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో పవన్ ఎవరికీ అర్ధం కాకపోవటం, పవన్ మూడ్ ఎప్పుడు ఎలాగుంటుందో ఎవరికీ తెలీకపోవటం లాంటి అనేక కారణాల వల్ల కుటుంబంలో చాలామంది పవన్ కు దూరంగానే ఉంటారు. మాటస్ధిరత్వం లేకపోవటం, ఏ విషయంపైన కూడా అవగాహన లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒంటికి కారం రాసుకున్నట్లు పూనకం వచ్చినట్లు రెచ్చిపోవటం లాంటి అనేక కారణాల వల్ల చిరంజీవి దూరంగా ఉంటున్నారు. చిరంజీవి దూరంగా ఉన్నారు కాబట్టి చాలామంది రాజకీయాలకే దూరంగా ఉన్నారంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: