మాటకు ముందుకొసారి తర్వాత సారి జాతీయస్ధాయిలో చక్రం తిప్పాను, అబ్దుల్ కలామ్ ను నేనే రాష్ట్రపతిని చేశానని చెప్పుకుంటుంటారు. ప్రధానమంత్రి గా వాజ్ పేయ్ ఉన్నపుడు ఎయిర్ పోర్టునుండి ప్రధాని కార్యాలయం వరకు తనకు రెడ్ కార్పెట్ వేసేవారు, తన రాకకోసం వాజ్ పేయి వెయిట్ చేసేవారు అంటే పదే పదే సంవత్సరాల పాటు రికార్డు వినిపించారు. కేంద్రంలో తాను చక్రం తిప్పానని ఎన్నిసార్లు చెప్పుకున్నారో లెక్కేలేదు.





ఇంతకీ ఇదంతా ఎవరి విషయమో ఈపాటికే అర్ధమైపోయుంటుంది. అవును చంద్రబాబునాయుడు గురించే. ఇపుడిదంతా ఎందుకంటే జాతీయస్ధాయిలో చంద్రబాబు చక్రం తిరగటం ఆగిపోయింది. ఎలాగంటే రాష్ట్రపతి ఎన్నికల్లో నాన్ ఎన్డీయే తరపున గట్టి అభ్యర్ధిని పోటీచేయించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.






ఈ ప్రయత్నాల్లోనే బుధవారం ఢిల్లీలో 22 పార్టీల అధినేతలతో మీటింగ్ కూడా పెట్టారు. ఆ మీటింగుకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు ఆహ్వానాలు అందలేదని ప్రచారం జరిగింది. ఇద్దరినీ ఎన్డీయే మిత్రులుగానే మమత లెక్కేశారు కాబట్టి పట్టించుకోలేదన్నది ప్రచారం. అయితే తాజాగా మమత నుండి జగన్ కు ఆహ్వానం అందిన విషయం బయటపడింది. ఈనెల 11వ తేదీనే జగన్ కు ప్రత్యేకంగా మమత లేఖ రాశారు. మరీ లేఖ విషయం ఎందుకని మీడియాలో రాలేదో అర్ధం కావటంలేదు.






సరే జగన్ కు లేఖరాసిన మమత మరి చంద్రబాబును ఎందుకు వదిలేశారు ? ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుత బలం నామమాత్రం మాత్రమే. ఎలక్టోరల్ లిస్టులో టీడీపీకి పెద్ద బలం లేని కారణంగానే అటు నరేంద్రమోడి, అమిత్ షా ఇటు మమత అంతాకలిసి చంద్రబాబును దూరం పెట్టేసినట్లు అర్ధమవుతోంది. అంటే చంద్రబాబు చక్రం జాతీయరాజకీయాల్లో తిరగటం ఆగిపోయినట్లే అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా పుంజుకోవాలో అర్ధం కావటంలేదు. రాష్ట్రంలోనే అలా అలా తిరుగుతున్న  చక్రం  జాతీయస్ధాయిలో తిరగటం దాదాపు ఆగిపోయినట్లే. అందుకనే చంద్రబాబును ఎవరు పట్టించుకోవటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: