ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకోసం అడ్వాన్స్ అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తున్న ప్రభుత్వం, పాసై మార్కులు తక్కువగా వచ్చిన వారికి బెటర్మెంట్ నిర్వహించడానికి సిద్దమైంది. అయితే ఇది ఏమేరకు, ఎంతమందికి ఉపయోగం అనేది తేలాల్సి ఉంది. ఫెయిలైన వాళ్లు సప్లిమెంటరీ రాస్తే వారికి కంపార్ట్ మెంటల్ గ్రేడ్ ఇవ్వబోమని అధికారులు భరోసా ఇచ్చారు. వారికి కూడా గ్రేడ్లు ఇస్తారు. అలాగే పాసై మార్కులు తక్కువ వచ్చిన వారికి కూడా గ్రేట్లు ఆయా మార్కులనుబట్టి ఇస్తారు. ఈమేరకు పదో తరగతి విద్యార్థులకు బెటర్మెంట్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని, ప్రణాళిక రూపొందించాలని పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే బెటర్మెంట్ పరీక్షలకు కొన్ని కండిషన్లు పెట్టారు అధికారులు. పది పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్ లో 49 కంటే తక్కువ మార్కులు వచ్చినవారికే బెటర్మెంట్ రాసే అవకాశం ఉంది. అందులోనూ వారు కేవలం రెండు సబ్జెక్ట్ లలో మాత్రమే బెటర్మెంట్ రాసేందుకు అనుమతి ఇస్తారు. పరీక్ష ఫీజు కూడా భారీగానే ఉంది. ఒక్కో సబ్జెక్ట్ కి పరీక్ష ఫీజు రూ.500 గా నిర్ణయించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన వారికి మాత్రమే ఈ అవకాశం.

బెటర్మెంట్ పరీక్షలు అనేవి మెయిన్ పరీక్షల్లో మార్కులు తక్కువవచ్చినవారికి ఉపయోగపడతాయి అంటూ ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. మొత్తంగా ఇది ఎంతమంది విద్యార్థులకు ఉపయోగం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి ఏపీలో టెన్త్ క్లాస్ పాస్ పర్సంటేజీ కేవలం 67.72 శాతం మాత్రమే. మిగతా 32.28 శాతం మంది పరీక్షల్లో ఫెయిలయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పాసైనవారిలో చాలామంది మంచి మార్కులు సాధించారు. వారంతా ఇప్పుడు పరీక్షలు రాయరు. మార్కులు పెంచుకోవాల్సిన అవసరం వారికి లేదు. ఇక సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారికి బెటర్మెంట్ అవకాశం ఎలాగూ లేదు. 49 కంటే మార్కులు తక్కువగా వచ్చినవారికి మాత్రమే బెటర్మెంట్ అవకాశం ఉంది. అలాంటి వారు తక్కువగా ఉన్నారు. దీంతో మొత్తంగా బెటర్మెంట్ పరీక్షలు రాసేవారి సంఖ్య తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: