గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అయితే వారికి అక్కడ చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పథకాలు వచ్చినవారు సరే, రానివాళ్లు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో వారంతా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఆయన.. స్థానికంగా కాకినాడ 24వ వార్డులో పర్యటించారు. అక్కడ ఆయన ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి పదే పదే తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే ద్వారంపూడిని అడిగారు. అయితే ఆయన విసిగించడంతో ద్వారంపూడి ఆయనపై నోరు జారారు. దీంతో అది సంచలనంగా మారింది.

పింఛన్ కోసం వచ్చిన వ్యక్తి తనకు పింఛన్ ఇవ్వడంలేదని, తనను అనర్హుడిగా పేర్కొన్నారంటూ ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆయన ఆధార్ కార్డ్ పరిశీలించారు. దానిలో వయసు సహకరించదని తేలింది. దీంతో ఆయనకు ఎమ్మెల్యే వివరంగా చెప్పారు. కానీ అతను పదే పదే ఎమ్మెల్యేని విసిగించడంతో చివరకు ఎమ్మెల్యే దొబ్బెయ్ అనే మాట అన్నారని తెలుస్తోంది. టీడీపీ అనుకూల మీడియా ఈ వ్యవహారాన్ని పెద్దది చేసింది.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కాస్తో కూస్తో ఇబ్బందులుంటే ప్రజా ప్రతినిధులకు వాటిని చేరవేస్తున్నారు ప్రజలు. రోడ్ల సమస్యలున్నాయని, ఇతరత్రా పథకాల్లో తమ పేర్లు లేవని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా సావకాశంగా ఆ మాటల్ని వింటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రజలు నిలదీయడంతో ఎమ్మెల్యేలకు ఏం చేయాలో తోచడంలేదు. ఎందుకు పథకాలు రావడంలేదని అధికారుల్ని అడుగుతున్నా.. వారు అనర్హులు అని చెప్పేస్తున్నారు. కానీ ఇటు ప్రజలు మాట వినడంలేదు. దీంతో ఇబ్బందికర వాతావరణం తలెత్తుతోంది. తాజాగా ఎమ్మెల్యే ద్వారంపూడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పదే పదే పింఛన్ కోసం అడిగిన ఆ వ్యక్తిపై ఎమ్మెల్యే.. ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు.  వింటున్నాను కదా అని మీద మీద పడిపోతే ఊరుకోను అంటూ ఆయన ఆ వ్యక్తిని హెచ్చరించారు. ఆధార్ కార్డులో వయసు తప్పుగా నమోదయిందని, దానికి ఎవరూ ఏమీ చేయలేరని, తప్పుగా ఉన్నప్పుడు తిన్నగా ఉండాలని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: