అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు చరిత్రను తీసి ఆయనకు, ఎన్టీఆర్ కి మధ్య ఉన్న వైరాన్ని బయటపెట్టాలని చూస్తున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో చంద్రబాబు, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన విషయం కూడా పదే పదే హైలెట్ చేస్తున్నారు. ఇటీవల మినీ మహానాడులపేరుతో యాత్రలు చేపట్టిన చంద్రబాబు పొరపాటున బొబ్బిలి పులి సినిమా పేరెత్తారు. ఆ సినిమా చూసి ప్రజలు తిరగబడాలని సలహా ఇచ్చారు. అయితే ఆ సినిమా పేరెత్తితే ప్రజలు చంద్రబాబుపై తిరగబడతారని హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు. ఆ సినిమా చూస్తే ఎన్టీఆర్ కి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు ప్రజలకు గుర్తొస్తుందని, అందుకని ఎన్టీఆర్ సినిమాలు చూడాలంటూ చంద్రబాబు ప్రజలకు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే రాజకీయ విమర్శల వేడి రాజుకుంటోంది. మంత్రులు టీడీపీ నేతలపై, ముఖ్యంగా చంద్రబాబుపై తమదైన రీతిలో మండిపడుతున్నారు. అందులో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కాస్త ముందున్నారు. ఇటీవల జిల్లా యాత్రల్లో చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని అన్నారు మంత్రి అంబటి. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారయ్యారంటూ చంద్రబాబు విమర్శించడం సరికాదన్నారు. క్విట్ జగన్ అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అలాంటి మాటలు మాట్లాడతారా అని ప్రశ్నించారు అంబటి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, టీడీపీది ముగిసిపోయే చరిత్ర అని చెప్పారు.

బొబ్బిలి పులి సినిమా గుర్తుకు తెచ్చుకుని ప్రజలు, టీడీపీ కార్యకర్తలు  ఆవేశం తెచ్చుకోండి అంటూ చంద్రబాబు చెబుతున్నారని.. అలా చేస్తే అది చంద్రబాబుకే నష్టం అని అన్నారు. ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చంద్రబాబు ఆయనకు చేసిన మోసం ప్రజలకు గుర్తొస్తుందని, అదే గుర్తొస్తే.. ప్రజలు ఆయనను చెప్పులు తీసుకుని కొడతారని అన్నారు. చంద్రబాబును బట్టలూడదీసి ప్రజలు కొట్టే రోజొస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి డయాఫ్రమ్ వాల్ పై చంద్రబాబు చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు అంబటి. చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, ఆయన అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి తాము చెప్పాల్సిన పనేమీ లేదని, ఆయన తోడల్లుడే ఓ పుస్తకంలో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తారని రాసుకొచ్చారని గుర్తు చేశారు అంబటి.

మరింత సమాచారం తెలుసుకోండి: