అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో అల్లర్లను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయంటూ కేంద్రం మండిపడుతోంది. అదే సమయంలో అల్లర్లను అణచివేసే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి. బీహార్ లో అల్లర్లను అణచివేసేందుకు స్థానిక ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. అదే సమయంలో ఇటు తెలంగాణలో మాత్రం అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఒకరకంగా తాము ప్రజల పక్షమేనని చెప్పింది తెలంగాణ సర్కార్.

అగ్నిపథ్ కాల్పుల్లో వరంగల్ కి చెందిన రాకేష్ అనే యువకుడు మృతిచెందాడు. దీనికి కేంద్ర రైల్వే  బలగాలు కారణం అని ఆరోపిస్తున్నారు కేసీఆర్. రాకేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అక్కడితో ఆగలేదు, ఏ ఉద్యోగం కోసమైతే రాకేష్ ప్రాణాలు వదిలేరో.. అలాంటి ప్రభుత్వ ఉద్యోగమే ఆ కుటుంబానికి ఇస్తామని హామీ ఇచ్చారాయన. రాకేష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్లే రాకేష్ మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..
అగ్నిపథ్ అల్లర్లు టీఆర్ఎస్, బీజేపీకి మధ్య మరోసారి మంటపెట్టాయి. కేటీఆర్ నేరుగా కేంద్రాన్ని విమర్శిస్తూ వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. కేంద్రం మొండి వైఖరి వల్లే సామాన్యుల ప్రాణాలు పోయాయని, నిరుద్యోగుల్ని మోదీ నిండా ముంచేశారని అంటున్నారు. మరోవైపు బాధిత కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉండటం కూడా.. కేంద్రానికి మింగుడు పడటంలేదు. అల్లర్లకు కారణం అయినవారిని ఉపేక్షించేది లేదని కేంద్రం చెబుతోంది, మరోవైపు అల్లర్ల కారణంగా జరిగిన కాల్పుల్లో ప్రాణాలొదిలిన రాకేష్ కుటుంబానికి టీఆర్ఎస్ అండగా నిలిచింది. దీంతో మరోసారి టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు తీవ్రతరమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాల సాయంలో ఈ అల్లర్లను అదుపు చేయాలని కేంద్రం భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: