టెక్నాలజీ అనేది పదునైన కత్తిలాంటిది. కత్తిని కూరగాయలు కట్ చేసుకునేందుకు ఉపయోగించ్చు. అలాగే పడనివారి పీకలు కత్తిరించటానికి కూడా ఉపయోగించచ్చు. ఉపయోగించే వ్యక్తుల విచక్షణపైన ఆధారపడుంటుంది కత్తి వాడకం. టెక్నాలజీ కూడా సేమ్ టు సేమ్. ఇపుడిదంతా ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనుక వాట్సప్ కీలకంగా ఉందని బయటపడింది.







కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనకారులంతా సమాచారం ఇచ్చిపుచ్చుకనేందుకు వాట్సప్ నే ఉపయోగించుకున్నట్లు బయటపడింది. తెలంగాణా వ్యాప్తంగా రెండేళ్ళక్రితం ఆర్మీ రిక్రూట్ మెంటు పరీక్షలు పాసై, మెడికల్ టెస్టు కూడా పాసై ఫైనల్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న వేలాదిమంది అభ్యర్ధులకు కేంద్రం ప్రకటించిన పథకం షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో అప్పటికప్పుడు అభ్యర్ధులందరు వాట్సప్ చాటింగ్ ద్వారా గురువారం రాత్రే సికింద్రాబాద్ కు చేరుకున్నారట. ఈ విషయాన్ని రైల్వే పోలీసులే ప్రకటించారు. 





రాత్రే స్టేషన్లోకి ప్రవేశించి వేర్వేరు ప్లాట్ ఫారాల మీద వెయిట్ చేశారు. శుక్రవారం ఉదయానికి అందరు వాట్సప్ ద్వారానే చాటింగ్ చేసుకుని ఎక్కడివాళ్ళక్కడే విధ్వంసం స్టార్ట్ చేశారు. ఇంత ప్లాన్డ్ గా జరిగిన విధ్వంసం కాబట్టే ఉన్నకొద్దిమంది పోలీసులూ ఏమీ చేయలేకపోయారు. ఆందోళనకారులను అరెస్టులు చేసిన పోలీసులు వాళ్ళదగ్గర నుండి మొబైల్ ఫోన్లు తీసుకుని చెక్ చేసినపుడు ఈ విషయాలు బయటపడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ మీద దాడి విషయంలోనే కొన్ని వందల వాట్సప్ చాటింగులను గమనించినట్లు  పోలీసులు తెలిపారు. 





మొన్నటికిమొన్న ఏపీలోని కోనసీమలో జరిగిన విధ్వంసంలో కూడా వాట్సప్ చాటింగులే కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఆందోళనకారులు ఒక ప్లాన్ ప్రకారమే వాట్సప్ చాటింగులు చేసుకుని ఎవరెవరి ఇళ్ళను ఎవరు దగ్ధంచేయాలో ముందే డిసైడ్ చేసుకున్నారు. మరుసటి రోజు ఆ చాటింగ్ ప్రకారమే ఆందోళనకారులు గ్రూపులుగా విడిపోయి కొందరు మంత్రి విశ్వరూప్ ఇంటిపైన మరికొందరు ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ ఇంటిపైన, మరికొందరు ప్రైవేటు, ప్రభుత్వ బస్సులను టార్గెట్ చేసుకున నిప్పుపెట్టారు. మొత్తానికి విధ్వంసాలకు, ఆందోళనలకు సోషల్ మీడియా ఈ విధంగా ఉపయోగపడుతుండటం నిజంగా దురదృష్టమనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: