దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విషయంలో వారసత్వంపై ఫైట్ మొదలైందా ? ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు, వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల యాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు తెలంగాణాలో వైఎస్సార్ వారసత్వం ఆయన బిడ్డగా తనకు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పేశారు. వైఎస్ వారసత్వం ఇతర వ్యక్తులకు కానీ లేదా వేరే పార్టీలకు కానీ ఉండదని షర్మిల స్పష్టంగా ప్రకటించారు.





వారసత్వంపై షర్మిల ఇంత బహిరంగంగా ఎందుకు ప్రకటించాల్సొచ్చింది ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్సార్ పరిపాలనను, సంక్షేమపథకాలను ఓన్ చేసుకుంటోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈమధ్య ఎక్కడ అవకాశం దొరికినా వైఎస్సార్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేసిన సేవలను, అమలుచేసిన సంక్షేమపథకాల గురించి గొప్పగా చెబుతున్నారు. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే షర్మిల వారసత్వం గురించి ఇంత ఘాటుగా చెప్పింది.





ఇదే సమయంలో జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండే తాను పోటీచేయబోతున్నట్లు స్వయంగా షర్మిల ప్రకటించారు. మొదటినుండి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులు చాలాఎక్కువమందున్నారు. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో పోటీచేయకపోయినా వైసీపీ తరపున పోటీచేసిన వారిలో ఒక ఎంపీ, ముగ్గురు ఎంఎల్ఏలు గెలవటం గమనార్హం. ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు.






అలాగే పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటలో  తాటి వెంకటేశ్వర్లు, వైరాలో మదన్ లాల్ ఎంఎల్ఏలుగా గెలిచారు. కేవలం వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేస్తేనే నలుగురు గెలిచారంటేనే ఈ జిల్లాలో ఏ స్ధాయిలో అభిమానులు, మద్దతుదారులున్నారో అర్ధమవుతోంది. అందుకనే షర్మిల కూడా ఖమ్మం జిల్లాలోని పాలేరునే పోటీకి వ్యూహాత్మకంగా ఎన్నుకున్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటే మెజారిటి ఓటర్లు ట్రైబల్సే. రెడ్లు కాకుండా గిరిజనులు, ఎస్సీ, ముస్లిం మైనారిటిల్లో వైఎస్ మద్దతుదారులుగా ఉండేవారు. ఆ అభిమానాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనే షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి చివరకు రిజల్టు ఎలాగుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: